నా చర్మం ఒలిచి ప్రజలకు చెప్పులు కుట్టించినా రుణం తీరదు

సిద్దిపేట : గుర్రాలగొందికి చెందిన నా అన్నదమ్ముల్లు, అక్కాచెల్లెళ్లు నన్ను గుండెల్లో పెట్టుకున్నందుకు ధన్యుడినయ్యాను. మీ ఊరికి పిలిపించి ఏకగ్రీవ తీర్మానం చేసి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చారు. మరోసారి ఎన్నికల బరిలోకి దిగిన నాపై పూర్తి విశ్వాసం చూపించి నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచారు. ఎన్నికల ఖర్చుకు డబ్బులిచ్చి ఓట్లేసి గెలిపిస్తున్న గుర్రాలగొంది గ్రామస్తుల రుణం తీర్చుకోలేనిది. నా చర్మం ఒలిచి ప్రజలకు చెప్పులు కుట్టించినా రుణం తీరదు అని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. గుర్రాల గొంది ప్రజల అభిమానంతో మంత్రి హరీశ్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు. మీరిచ్చిన బలం, మీ చైతన్యం, మీ ఆశీస్సులే నాకు శ్రీరామరక్ష. మీ అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేశాననే ఒక గుర్తింపునైతే పొందాను. కాని ఈరోజు మీరందించిన శక్తి నా పనితీరుకు ఫలితంగా భావిస్తున్నాను. ఒక సంతృప్తిని నాకందించారు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆరాటం, తపన మీలో ఉండడం వల్లే సాధ్యమైంది. ఇదే రీతిలో అభివృద్ధిని కొనసాగించాలనే పట్టుదల కూడా మీలో ఉందనడానికి ఇంతకుమించిన నిదర్శనం ఇంకేముంటుంది. చరిత్రలో అందరి పాత్ర ఉంటుంది. కాని ఆ చరిత్రను తిరగరాయాలంటే కొందరికే సాధ్యమవుతుంది. ఆ కొందరిలో మీరూ ఉంటారనడానికి ఇంతకన్నా ఏం కావాలి. ఈ గ్రామ అభివృద్ధిలో నాతోపాటు నడుస్తున్న రవీందర్ రావు రుణం తీర్చుకోలేనిది. ఈ ఊరికి కుటుంబసభ్యుడిగా, తోబుట్టువుగా తోడుగా నిలుస్తున్నారు. శ్రీమంతుడు అనే సినిమాలో హీరో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాడు. కాని మన ఊరి శ్రీమంతుడు మీ ఆలోచనలను, కష్టాలను, కన్నీళ్లను కూడా పంచుకుంటారు. ఏ పనికి కూడా వెనక్కుతగ్గకుండా ముందడుగు వేయడమే ఆయనకు తెలిసిన సామాజిక సేవ. నన్ను ఎప్పుడు కలిసినా మీ గురించి, మీ మంచితనం గురించి, గ్రామంలో జరగే పనుల గురించే చెప్పడం తప్ప మరో ఆలోచనే ఉండదు. అందరి కృషితో గ్రామ రూపురేఖలను ఈ నాలుగేళ్లలోనే పూర్తిగా మార్చుకున్నాం. ఊరిలో ఎవరైనా చనిపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్లు. బావుల దగ్గర , చెరువుల దగ్గర ఖననం చేసేవారు. చెరువుల నీళ్లుంటే అంత్యక్రియలు చేయడానికి అరిగోస పడిన నా ప్రజల కష్టాలను నేనెన్నటికీ మరువబోను. గుండె తరుక్కుపోయేది. అందుకే శ్మశాన వాటికను అద్భుతంగా కట్టించి మీకు అందించాం. మూడేళ్ల కింద మీ స్కూల్ స్వర్ణోత్సవాలకు వచ్చినపుడు సక్సెస్ పాఠశాల కావాలన్నరు. మీ పిల్లల బాధలు చెప్పిండ్రు. ఆనాడే మాట ఇచ్చినట్లు మీ ఊరికి గురుకుల పాఠశాలను మంజూరు చేసిన. రూ.13.10 కోట్లతో భవనం కడుతున్నాం. గొప్ప విద్యాలయం ఈ ఊరిలో ఉండబోతున్నది. గిడ్డంగి కట్టుకున్నం. కొంతమందికి పని కూడా దొరుకుతాంది. విఠలాపురం, నారాయణరావుపేట పోవాలంటే సైకిళ్ల బాట కూడా సక్కగ లేకపోయేది. ఇవాళ ఎంత పెద్ద రోడ్లు వేసుకున్నామో మీకు తెలుసు. బావుల కాడికి పోయే సైకిళ్లు పంచర్ కాకుంట ఇంటికి తిరిగి వచ్చేవి కావు. ఈరోజు లారీలు తిరిగేలా రోడ్లు వేసుకున్నాం. పాపం మీ ఊరికే చెందిన పిట్ల రాజు కూలి పని చేసుకుంటూ వ్యవసాయ బోరు మోటారు దించుతుంటే గాయపడ్డాడు. రూ.2లక్షలు (ఎల్.వో.సి) ప్రభుత్వం తరపున ఖర్చు పెట్టి మళ్లీ పని చేసుకునేటట్లు ట్రీట్ మెంట్ ఇప్పించినం. ఆయన కుటుంబానికి , అతడి ప్రాణానికి అండగ నిలబడ్డం. ఇంకా కోణం లింగం, ఆరేటి మంజుల లాంటి ఎంతోమంది అనారోగ్యాలకు గురైతే సీఎంఆర్ ఎఫ్ ద్వారా ఆదుకున్నం. కొందరికి డబ్బులు రావాల్సి ఉండే. రేపోమాపో అవి కూడా మీ చేతికి వస్తాయి. మొన్నటికి మొన్న మీ ఊళ్లోనే గుర్రం ఎల్లారెడ్డి అనే రైతు అనారోగ్యంతో చనిపోయిండు. పాపం ఆయన భార్య కూడా కొన్నేండ్ల కిందట కాలం చేసిందని విన్నాను. ఇద్దరు అబ్బాయిలు తల్లిదండ్రులను కోల్పోయారనే విషయం నన్ను కలచివేసింది. పాపం ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. వారికి అండగా నిలవాలని మీ గ్రామస్తులే చెప్పారు. వారి బాధను పంచుకోవడమే తప్ప ఇంకేం చేయగలం. అయితే వారికి ఎంతోకొంత భరోసాను కలిగించడానికి రైతు భీమా ఒక్కటే ఆధారమైంది. అధికారులకు చెప్పి వెంటనే వారికి రూ.5లక్షల చెక్కును అందించాను. నా తుది శ్వాస ఉన్నంత వరకు మీ ఇంటి పెద్ద కొడుకుగా మీకోసం శ్రమిస్తూనే ఉంటాను అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
× RELATED మూస రాజకీయాలకు స్వస్తి: ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి