పోరుకు సై.. కారుకు జై!

హైదరాబాద్: ప్రతి ఓటరుకు అనుసంధానమయ్యే ప్రణాళికతో టీఆర్‌ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేసే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న టీఆర్‌ఎస్ ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ప్రతిపక్ష పార్టీలకు ముచ్చేమటలు పట్టిస్తున్నారు. వాడలు, బస్తీలు, కాలనీలను చుట్టేసి అన్ని వర్గాల మద్దతును కూడగడుతూ ప్రత్యర్థులకు వెన్నులో వణుకుపుట్టిస్తుండడం గమనార్హం. అభ్యర్థుల కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు ఆయా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. అందరూ ఒక్కతాటిపైకి గ్రేటర్ టీఆర్‌ఎస్‌లో అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ప్రచార పర్వాన్ని ఉధృతం చేశారు. కార్పొరేటర్లు, నియోజవర్గ ముఖ్యనేతలు కొందరు ప్రకటించిన నియోజకవర్గాల్లో అభ్యర్థిని వ్యతిరేకిస్తూ నిరసన చేసిన క్రమంలో కేటీఆర్ రంగంలోకి దిగి అసంతృప్తిపరులను బుజ్జగించారు. ఉప్పల్, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో అసమ్మతి బెడద లేకుండా వివాదాన్ని సమసిపోయేలా కేటీఆర్ తీసుకున్న మంత్రాంగం ఫలించింది. ఈ నేపథ్యంలో అందరూ ఒక్కతాటిపై నిలబడి అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే త్వరలో ప్రకటించే రెండవ జాబితాలోని స్థానాలైన మేడ్చల్ , మల్కాజిగిరి, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహాల్, మలక్‌పేట, చార్మినార్ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యాయి. ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎవరినీ ప్రకటించినా పార్టీ గెలుపునకు లక్ష్యంగా అందరూ ఒక్కటిగా నిలిచేలా రూట్ క్లియర్ చేశారు.
× RELATED కారు బోల్తాపడి వ్యక్తి మృతి