ఉత్తమా.. ఉత్తమాటలేల?

-పంజాబ్‌లో రైతులకు రుణమాఫీ ఏకకాలంలో సాధ్యమైందా? - అక్కడ బొక్కబోర్లాపడి.. ఇక్కడా అదే పల్లవి అందుకుంటారా? -ప్రభుత్వానికొచ్చే ఆదాయమెంతో, ఖర్చెంతో తెలుసా? - టీఆర్‌ఎస్ పథకాలను కాపీకొట్టి ప్రగల్భాలేల? హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దశాబ్దాల నుంచి దగాచేసి ఇప్పుడు అలవికాని హామీలతో ప్రజలను మాయచేస్తూ తొక్కైనా అధికార పీఠాన్ని అధిరోహించాలని ఉత్తమ్ కుమార్‌రెడ్డి తహతహలాడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ఆర్థిక పరిజ్ఞానం అంతంత మాత్రమే ఉన్న పీసీసీ అధ్యక్షుడు తన పేరుకు తగ్గట్టే ఉత్తుత్తి హామీల వర్షం కురిపిస్తూ మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పంజాబ్‌లో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామంటూ బొక్కాబోర్లా పడిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలోనూ మళ్లీ అదే పల్లవిని అందుకున్నదని మరి పంజాబ్‌లో సాధ్యంకానిదాన్ని తెలంగాణలో ఎలా సుసాధ్యం చేస్తుందో ఉత్తమ్ జవాబు చెప్పాలని డిమాండ్‌చేస్తున్నారు. ఉత్తుత్తి హామీల అమలు కోసం ఆర్థిక నిపుణులతో చర్చించామని చెబుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరింత లోతుగా అధ్యయనంచేస్తే వాస్తవాలు తెలుస్తాయని ప్రజలు హితవు చెప్తున్నారు. తెలంగాణ ఖజానాకు నెలకు వచ్చే సొమ్మెంత? అందులో సంక్షేమం, ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించే మొత్తమెంత? అనే విషయాలపై కూలంకషంగా అధ్యయనంచేసి సాధ్యాసాధ్యాలపై ప్రజలు నమ్మేలా హామీలిస్తే బాగుంటుందన్న విషయాన్ని ఇకనైనా గ్రహిస్తే మంచిదని హితవుపలుకుతున్నారు.

దేశ బడ్జెట్ కూడా సరిపోదు..

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన ఉత్తుత్తి హామీలకు రాష్ట్ర బడ్జెట్టే కాదు.. దేశబడ్జెట్ మొత్తాన్ని ఇక్కడే ఖర్చుచేసినా సరిపోదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుతం నెలకు రూ.10,340 కోట్ల ఆదాయం, రూ.10,082 కోట్ల ఖర్చుతో ముందుకుసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మిగిలిన రూ.258 కోట్లను ఇతర పథకాల కోసం ఖర్చు చేస్తున్నది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖజానాలో ఉన్న సొమ్ముకు అనుగుణంగానే పథకాల్ని రచించి సొమ్మును వెచ్చించాలి. ఈ ప్రాథమిక విషయాన్ని మరిచిపోయి అంతా ఉచితమే అంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భ్రమలను కలిపిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చే హామీలను అమలుచేయాలంటే రాష్ట్ర బడ్జెట్‌తోపాటు కేంద్ర బడ్జెట్‌ను వెచ్చించినా సరిపోదన్న సాధారణ ప్రజలకు తెలిసిన నిజం ఉత్తమ్‌కు తెలియడంలేదని ఎద్దేవాచేస్తున్నారు.

కాపీ చేయడంలో కాంగ్రెస్ దిట్ట!

తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను కాపీకొట్టి అదనంగా తాయిలాలను ప్రకటించి మసిపూసి మారేడుకాయచేసే పనిలో కాంగ్రెస్ పార్టీ దిట్టగా అవతరించిందని, విపరీతంగా ప్రజాదరణ పొందుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేసి.. ఆచరణ సాధ్యంకాని విధంగా ప్రజల ముంగిట్లోకి తెచ్చి.. నమ్మించే పనిలో కాంగ్రెస్ ఉన్నట్టు ఎవరికైనా ఇట్టే అర్థమవుతున్నదని తెలంగాణవాదులంటున్నారు. రాష్ట్రంలో రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని గొప్పలకు పోతున్నదని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం.. రూ.17 వేలకోట్లు వెచ్చించి రూ.లక్షలోపు పంట రుణాన్నీ మాఫీచేసింది. అంతేకాకుండా ప్రతి రైతుకు ఏటా ఎకరానికి రూ.8000 చొప్పున పంట పెట్టుబడిని అందజేయడంతో అన్నదాతలు బ్యాంకుల నుంచి పెద్దగా రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కొత్త నాటకం మొదలెట్టిందని తెలంగాణవాదుల అభిప్రాయం. ఒక్కో మహిళా సంఘానికి గ్రాంటు కింద రూ.లక్ష ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కొత్తగా చెప్తున్నదేం కాదు. ఈ పథకం ఇదివరకే రాష్ట్రంలో అమల్లో ఉన్నది. పది లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటూ సరికొత్త రాగాలు పలుకుతున్నారని.. కేవలం అధికార దాహం తీర్చుకోవడంకోసమే ఇలా హామీలిస్తున్నారే తప్ప మరొకటి కాదని తెలంగాణ వాదులు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మేలుచేయాలనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు నిజంగా ఉంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అవసరమే ఉండేది కాదంటున్నారు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి హామీలనే గుప్పించినప్పటికీ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ మాయజాలాన్ని నమ్మేదిలేదని రాష్ట్ర ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
× RELATED నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో