పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ దేశానికే రోల్‌మోడల్

-ఇలాంటి పోలీస్‌స్టేషన్ ఎక్కడాచూడలేదు -నాలుగేండ్లలో తెలంగాణలో అద్భుతఫలితాలు -కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ ప్రశంసలు
ఖైరతాబాద్: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నదని కేంద్రహోంశాఖ సహాయమంత్రి హన్స్‌రాజ్ గంగారాం పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పోలీస్‌స్టేషన్లు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో రెండో అత్యుత్తమ పోలీస్‌స్టేషన్‌గా అవార్డు అందుకున్న పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ను మంగళవారం హన్స్‌రాజ్ గంగారాం.. రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, నగరపోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో కలిసి సందర్శించారు. రాష్ట్రంలో స్మార్ట్ పోలీసింగ్ విధానం, నేర పరిశోధనలో అధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, బంజారాహిల్స్‌లో నిర్మితమవుతున్న టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ వివరాలను డీజీపీ కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం హన్స్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ ఉన్నదని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి నాలుగేండ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించారని కొనియాడారు. రాష్ట్రంలో నేరాలసంఖ్య తగ్గిందని, షీటీమ్స్ ఏర్పాటుచేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సీపీ అంజనీకుమార్ నేతృత్వంలో నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ మండల డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్ రవీందర్, అడ్మిన్ ఎస్సై గురునాథ్, ఎస్సైలు శ్రీకాంత్‌గౌడ్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కృష్ణప్రసాద్, కవియుద్దీన్, సతీశ్‌కుమార్, డీఎస్సైలు షఫీ, విజయ్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. HansrajGangaramAhir

× RELATED టీఆర్‌ఎస్‌కు అదనంగా ఓట్లు