రేపే ఓటర్ల తుది జాబితా

-హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌తో తొలిగిన అడ్డంకులు -కొత్తగా నమోదైన ఓటర్లు 30 లక్షలు.. మొత్తం ఓట్లు 2.91 కోట్లు -యథావిధిగా ఓటర్ల నమోదు కార్యక్రమం -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ -తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీలో ఓటర్ల జాబితా ముద్రణ -ఆన్‌గోయింగ్ పథకాలకు కోడ్ వర్తించదు: ఈసీ అదనపు సీఈవో
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధమైంది. ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. శుక్రవారం (ఈ నెల 12న) ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణలపై సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. డ్రైవ్‌లో 33,14,006 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిని పరిశీలించి వివిధ కారణాలతో మూడు లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. మిగతా 30,00,872 దరఖాస్తులను సరైనవిగా గుర్తించామని పేర్కొన్నారు. గతంలో ఉన్న డ్రాఫ్ట్‌రోల్‌లో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజాగా మరో 30 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని, కొత్త ఓటరు జాబితాలో 2.91 కోట్ల మంది ఓటర్లుగా నమోదవుతారని చెప్పారు.

ఈఆర్వోనెట్‌పై నమోదు

ఓటరు జాబితాలో కొత్తగా చేరినవారి పేర్లను ఈఆర్వో నెట్ అనే సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నామని రజత్‌కుమార్ చెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. అభ్యర్థుల నామినేషన్ల తుది గడువుకు 10 రోజుల ముందువరకు ఓటరుగా నమోదుచేసుకున్న వారిని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. వీరికి ప్రత్యేక జాబితాలో చోటు కల్పిస్తామని పేర్కొన్నారు. జాబితా విడుదలయ్యాక ఓటర్ల ఐడీ (ఇపిక్) కార్డులు ముద్రిస్తామని, కొత్తవారికీ కార్డులు ఇస్తామని వెల్లడించారు.

యథావిధిగా ఆన్‌గోయింగ్ పథకాలు: సైదా

ఆన్‌గోయింగ్ పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని ఎన్నికల కమిషన్ అదనపు సీఈవో సైదా స్పష్టంచేశారు. ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పథకాలపై మాత్రమే నిషేధం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, సీఎంఆర్‌ఎఫ్ తదితర సంక్షేమ పథకాలపై ఎలాంటి నియంత్రణలేదని, అవి యథావిధిగా కొనసాగుతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్లలో ప్రధాని, ముఖ్యమంత్రి ఫొటోలను తొలిగించినట్టు సైదా తెలిపారు.

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న సీఎం ఫొటోలను కూడా తొలిగించామని, ఎక్కడైనా ఫొటోలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధికారులను ఈ నెల 17వ తేదీలోపు బదిలీ చేయాలని ఆదేశించినట్టు సైదా చెప్పారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు ఆస్కారంలేకుండా పారదర్శకంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మూడేండ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న పోలీస్, రెవెన్యూ అధికారులను ఎన్నికల వేళ బదిలీ చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.

నాలుగు భాషల్లో జాబితా

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాను నాలుగు భాషల్లో ముద్రించాలని నిర్ణయించింది. ఓటర్ల జాబితా విడుదలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జాబితాను ఓటర్లు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని 16 నియోజకవర్గాల్లో తెలుగుతోపాటు ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఓటర్ల జాబితాను ముద్రించనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మూడు నియోజకవర్గాల్లో తెలుగు, ఆంగ్లం, మరాఠీ భాషలో ఓటర్ల జాబితాను ముద్రించాలని నిర్ణయించింది. -ఉర్దూలోనూ ఓటర్ల జాబితాను ముద్రించే అసెంబ్లీ నియోజకవర్గాలు: నిజామాబాద్ అర్బన్, ముషీరాబాద్, మలక్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, కార్వాన్, చార్మినార్, బహదూర్‌పుర, నాంపల్లి, గోషామహల్, అంబర్‌పేట, మల్కాజ్‌గిరి. -మరాఠీలోనూ ఓటర్ల జాబితా ముద్రించే నియోజకవర్గాలు: బోథ్, ముథోల్, జుక్కల్

× RELATED ఫోర్బ్స్ జాబితాలో..