ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరం

-ఎన్నికల సంసిద్ధతపై అధ్యయనం చేశాం -రాష్ట్రంలో శాంతిభద్రతలపై సమీక్షించాం -రెండ్రోజుల సమీక్ష నివేదిక సీఈసీకి ఇస్తాం -తుది నిర్ణయం సీఈసీ వెలువరిస్తుంది -విలీన మండలాల అంశంపై సీఈసీదే నిర్ణయం -సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్‌సిన్హా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు చేస్తున్న అన్ని ఏర్పాట్లు సరైన మార్గంలో (రైట్ లైన్) ఉన్నట్టు తమ సమీక్షలో స్పష్టమైందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేశ్‌సిన్హా చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణపై పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఏడుగురు సభ్యుల ఉన్నతస్థాయి ప్రతినిధిబృందం బుధవారం వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించింది. మంగళవారం రాత్రి తొమ్మిది గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సమావేశమైన అధికారులు.. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, డీఈవోలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఫైనాన్స్, హోంశాఖ, ఎక్సైజ్, తదితర శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో విస్తృతంగా చర్చించారు. అనంతరం సచివాలయంలో మీడియా సమావేశంలో ఉమేశ్‌సిన్హా మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని ప్రభుత్వశాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ సిబ్బందితో శాంతిభద్రతల అంశాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో రెండ్రోజులపాటు చేపట్టిన అధ్యయనం నివేదికను సీఈసీకి నివేదిస్తామని, దానిని పరిశీలించి, సీఈసీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రెండ్రోజలపాటు సుదీర్ఘంగా చేసిన సమీక్షలో ఎన్నికలకు పోయేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయా? అన్న ప్రశ్నకు ఉమేశ్‌సిన్హా బదులిస్తూ అవును.. ప్రాథమిక ఏర్పాట్లు సరైన మార్గంలోనే ఉన్నాయి అంటూ సంతృప్తిని వ్యక్తంచేశారు.

వయోజనులందరికీ ఓటు హక్కు

ఓటర్ల జాబితాపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో సుదీర్ఘంగా చర్చించినట్టు ఉమేశ్‌సిన్హా చెప్పారు. రాష్ట్రంలో పలు రాజకీయపార్టీలు ఇచ్చిన ఇన్‌పుట్స్ ఆధారంగా అధికారులకు సూచనలు చేశామన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితా సవరణకు ఇచ్చిన 15 రోజుల గడువు సరిపోదని, దాన్ని పొడిగించాలని రాజకీయపక్షాలు కోరాయని తెలిపారు. కొన్ని పార్టీలు వినాయకచవితి, మొహర్రం తదితర పండుగల నేపథ్యాన్ని కూడా తమ దృష్టికి తీసుకొచ్చాయని చెప్పారు. వీటన్నింటినీ సీఈసీకి నివేదిస్తామన్నారు. ఎన్నికల్లో వయోజనులందరూ తమకు నచ్చిన అభ్యర్థిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటుహక్కు ద్వారా ఎన్నుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. కిందిస్థాయిలో అధికారులు పోలింగ్ కేంద్రం స్థాయిలో ఇంటింటికీ తిరిగి ముసాయిదా జాబితాను సవరించాలని సూచించామని తెలిపారు. నిజమైన ఓటరుకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఓటుహక్కు విషయంలో జిల్లాల హెల్ప్‌లైన్లు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించినట్టు ఉమేశ్‌సిన్హా తెలిపారు. అధికారులపై ఏవైనా ఫిర్యాదులు వస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. సీనియర్ అధికారులు ఆకస్మికంగా పోలింగ్‌స్టేషన్లను పరిశీలించాలని సూచించామని తెలిపారు. ఇప్పటివరకు ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్ల విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు చేపట్టాలన్నారు.

ప్రజాచైతన్యానికి ప్రచార కార్యక్రమాలు

ఓటర్ల నమోదు, ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించామని ఉమేశ్‌సిన్హా చెప్పారు. ఇందుకోసం సినిమాహాళ్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు, చాటింపు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఓటు విలువ తెలియజేసి, దాని ప్రాధాన్యం చాటాలని సూచించామన్నారు. ప్రధానంగా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ, ఎస్‌ఎంఎస్‌ను వెంటనే పునరుద్ధరించి, అవాంతరాలను సరిచేయాలని చెప్పామని తెలిపారు.

శాంతిభద్రతలు, ఈవీఎంలపై చర్చ

రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డీజీపీ, ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సమీక్షించినట్టు ఉమేశ్‌సిన్హా చెప్పారు. శాంతిభద్రతల అంశాలకు సంబంధించి మరింత కట్టుదిట్టమైన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు, పోలింగ్‌స్టేషన్లు, ఎన్నికల ఖర్చులు, సిబ్బంది వినియోగం, తదితర సమస్యలపై జిల్లా అధికారులతో సమీక్షించినట్టు తెలిపారు.

విలీన మండలాలపై సీఈసీకి నివేదన

రాష్ట్రంలోని ఏడు మండలాలను పోలవరం ముంపు గ్రామాల పేరిట పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన విషయంలో పలు పార్టీలు ఫిర్యాదులు చేశాయని, వాటిని సీఈసీకి నివేదిస్తామని ఉమేశ్‌సిన్హా తెలిపారు. తుది నిర్ణయం వారే తీసుకుంటారని చెప్పారు. మీడియా సమావేశంలో ప్రతినిధి బృందంలోని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు సందీప్‌జైన్, సందీప్ సక్సేనా, ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్‌ముఖర్జీ, డైరెక్టర్ జనరల్స్ దీదేంద్ర ఓజా, దిలీప్‌శర్మతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్ పాల్గొన్నారు.

× RELATED ఒక్క మండలం.. నలుగురు ఎమ్మెల్యేలు