ఊరూవాడా ప్రచారం

-దూసుకుపోతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు -అడుగడుగునా మద్దతుగా నిలుస్తున్న ప్రజలు
నమస్తే తెలంగాణ నెట్‌వర్క్ ;ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఊరూవాడా అంతా కలియదిరుగుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి.. మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నారు. కొందరు అభ్యర్థులు మార్నింగ్ వాక్ పేరిట ఉదయాన్నే ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రచారానికి ప్రజలనుంచి అద్భుత స్పందన లభిస్తుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే తాము టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపిస్తామంటూ పలు గ్రామాలు, తండాల వాసులు నిర్ణయించుకుని తమ మద్దతును బాహాటంగా వెల్లడిస్తున్నారు. అదే సమయంలో ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల వారు, యువకులు, మహిళలు పెద్దసంఖ్యలో గులాబీ గూటికి చేరుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మంగళవారం జెండా పండుగ నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం తథ్యమన్నారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యరకర్తల సమావేశంలో కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డితో కలిసి మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని 42వ డివిజన్‌లో అర్బన్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా పాదయాత్ర చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలుకరించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను ఆదరించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ తాను స్వయంగా రూపొందించిన క్లాత్ బ్యాగులను అందించారు. Mahendhar

కరీంనగర్‌లో మార్నింగ్ వాక్..

కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో కలిసి ఎంపీ బీ వినోద్‌కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్నింగ్ వాక్ నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. టీఆర్‌ఎస్ హయాంలో కరీంనగర్‌తో ఐదు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని, ఉజ్వల పార్కు సమీపంలో వేగంగా ఐటీ టవర్ పనులు సాగుతున్నాయని, వచ్చే జనవరి నాటికి మల్టీనేషనల్ కంపెనీ తన పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారని, త్వరలోనే స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. అనంతరం హన్మకొండలో జరిగిన వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట నియోజకర్గం పరిధిలోని ఖిలా వరంగల్, హన్మకొండ, వరంగల్, కాజీపేట మండలాల్లోని విలీన గ్రామాల టీఆర్‌ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఎంపీ వినోద్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఉండకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ కోర్టు పక్షులుగా మారారని ఎంపీ ధ్వజమెత్తారు. మంగళవారం రాత్రి తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రచారం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. KMR

ప్రతిపక్ష నాయకులను నిలదీయండి: మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రతిపక్ష పార్టీల నాయకులను.. గతంలో వారు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలంటూ నిలదీయాలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో ఎంపీ నగేశ్‌తో కలిసి మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జైనథ్ మండలం భోరజ్ చెక్‌పోస్టు నుంచి జైనథ్ వరకు 6 కిలోమీటర్ల మేర బైక్ ర్యాలీ తీశారు. అనంతరం మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదని, మహారాష్ట్రతో చర్చించి తమ ప్రభుత్వం ఆ నదిపై చనకా కొరాట ప్రాజెక్టు నిర్మిస్తున్నదని చెప్పారు.

పల్లెల్లో వెల్లువెత్తుతున్న మద్దతు

-కారు గుర్తుకే ఓటేస్తామంటూ నిర్ణయాలు పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పలు గ్రామాలు, తండాల వాసులు టీఆర్‌ఎస్‌కు బాహాటంగా మద్దతు ప్రకటిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి పోటీ చేస్తున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తామని పులికుచ్చతండా, ఇబ్రహీంపేట్ గ్రామ కులసంఘాల వారు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సమావేశమై దేశాయిపేట్ సహకార సంఘం అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్‌కు తమ నిర్ణయ పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి పోటీచేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌కు ఓటేస్తామని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి, కమలాపూర్‌లో వైశ్యులు, మేర, మున్నూరు కాపులు, దళితులు మంగళవారం సమావేశమై టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఓటేస్తామని జనగామ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు, కులసంఘాల వారు ముక్తకంఠంతో నిర్ణయించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం కడివెండికి చెందిన గౌడ కులస్థులు.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మద్దతు ప్రకటించారు. జనగామ పట్టణంలోని 4వ వార్డు ప్రజలు, బచ్చన్నపేట మండలం రామచంద్రాపూర్‌లోని ముదిరాజ్‌లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఓటేసి గెలిపించుకుంటామని నిర్ణయించారు. Crying

సారూ.. మీరు కన్నీళ్లు పెట్టొద్దు

జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన జనగామ రూరల్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో జనగామ తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కంటతడి పెట్టారు. బతుకుదెరువు కోసం జనగామ మండలం మరిగడి రైతులు చీటకోడూరు రిజర్వాయర్‌కు వస్తున్న నీటిని తరలిస్తే సొంత పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా కఠినంగా వ్యవహరించాను. జనగామ పట్టణవాసులకు తాగునీటి ఇబ్బందులు కలుగొద్దని కొందరిని బాధపెట్టేలా వ్యవహరించాను. ఆ తర్వాత ఎందుకిలా చేశానా అని రాత్రిపూట నిద్రపట్టక ఏడ్చాను అంటూ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు ముత్తిరెడ్డి. సార్ మీరు కన్నీళ్లు పెట్టొద్దు. మీ వెనక మేం ఉంటాం అని నాయకులు ఆయనకు అభయమిచ్చారు.

కంటతడి పెట్టుకున్న తాటికొండ

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న తనను కొంతమంది కావాలని బద్నాం చేస్తున్నారని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య కంటతడి పెట్టారు. మంగళవారం జనగామ జిల్లా జఫర్‌ఘడ్ మండల కేంద్రంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో పనిచేస్తున్నవారే తమ స్వార్థ రాజకీయాల కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గడప గడపకూ ప్రచారం చేస్తూ, రానున్న ఎన్నికల్లో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి, సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందించాలని రాజయ్య కోరారు.

× RELATED జయహో కేసీఆర్