జగ్గారెడ్డి భూ దందా!

-ప్రభుత్వ భూమిని మాకు అంటగట్టి కోట్లు దండుకున్నారు -న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఎస్పీలకు అమీన్‌పూర్ భూబాధితుల వినతి
సంగారెడ్డి చౌరస్తా/సంగారెడ్డి అర్బన్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ భూమిని అక్రమంగా తమకు అంటగట్టి కోట్ల రూపాయలు దండుకొన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకొని తమకు న్యాయంచేయాలని బుధవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్, ఈదులనాగులపల్లి భూ బాధితులు జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదుచేశారు. తనకు జరిగిన అన్యాయంపై 2017 అక్టోబర్ 21న నమస్తే తెలంగాణ దినపత్రికలో భూంఫట్ అనే శీర్షికతో కథనం ప్రచురితమైందని బాధితుడు ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. అమీన్‌పూర్ లోని సర్వే నంబరు 343/17 నుంచి మొదలుకొని వరుసగా 343/32 సబ్ డివిజన్ నంబర్లలో 80 ఎకరాల ప్రభుత్వభూమిని జగ్గారెడ్డి, బ్రోకర్లతో కలిసి తమను తప్పుదోవ పట్టించి అమ్మకానికి పెట్టారని చెప్పారు. ఆ భూమి కొనుగోలుకు సంబంధించి ముందుగా రూ.40 కోట్లకు పైగా ముట్టజెప్పామని చెప్పారు. ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ భూములను బినామీ పేరుతో విక్రయించి సొమ్ము చేసుకున్న జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వేడుకొన్నారు.

ఈదులనాగులపల్లిలో మరో మోసం

రామచంద్రాపురం మండలం గ్రామంలోని 134, 135 సర్వే నంబర్లలో 760 ఎకరాలు వాజిద్ అలీ, కామిల్ కుటుంబసభ్యులకు వారసత్వంగా సంక్రమించిన భూమిగా ఉన్నదని బాధితుడు బీ వీరేశం తెలిపారు. ఇందులో ఆర్డీవో క్లీన్‌చిట్ ఇచ్చిన 200 ఎకరాల నుంచి 144 ఎకరాలను వాజిద్‌అలీ కుటుం బ సభ్యుల ఆమోదంతో తన ప్రమేయంతో విక్రయించడానికి ఒప్పుకొని బోగస్ చెక్కులిచ్చారని ఆరోపిం చారు. జగ్గారెడ్డికి బినామీగా ఉన్న వ్యాపారి సుకేశ్‌గుప్తా, ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారని తెలిపారు. సేల్‌డీడ్‌ను తీసుకొని కోర్ ప్రాజెక్టు అనే సంస్థనుంచి రూ.160 కోట్లు తీసుకొని ఆ భూమిని అప్పగించారని పేర్కొన్నారు. సుకేశ్‌గుప్తా తమకు ఇచ్చిన చెక్కులు చెల్లలేదని.. బోగస్ చెక్కులను ఇచ్చి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని భూమిని విక్రయించిన జగ్గారెడ్డి ఆయన అనుచరులు సుకేశ్‌గుప్తా సోదరులపై 2012లో బీడీఎల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టామన్నారు. కేసు వేసిన విషయా న్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకొన్నారని వీరేశం ఆవేదన వ్యక్తంచేశారు. ఆయనపై కోర్టులో క్రిమినల్‌కేసు పెండింగ్‌లో ఉన్నదని గుర్తుచేశారు.

× RELATED టీఆర్‌ఎస్ నాయకుడి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి