రాజకీయాల్లో యువచైతన్యం

-అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో యువత కీలకం -ఓటర్లుగా నమోదులోనూ ఉత్సాహం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రలోని యువతీ యువకుల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపబోతున్నారు. యువ ఓటర్లే ఈసారి కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు కాకుండా,సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నారు. కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మాత్రం వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా సాధ్యం కాని తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ సాధించారని యువత యావత్తు భావిస్తున్నది. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చిన టీఆర్‌ఎస్ వైపు యువత, యువత మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌పై యువలోకం ప్రశంసలు కురిపిస్తున్నది. భవిష్యత్తులో ఫుడ్ ప్రాసెసింగ్, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఫార్మారంగం, టెక్స్‌టైల్ పరిశ్రమలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయన్న అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు.

18-19 ఏండ్ల నవయువ ఓటర్ల నమోదులో సమరోత్సాహం తెలంగాణ యువతకు రాజకీయ చైతన్యం ఎంత ఉన్నది అనేది తాజాగా విడుదలైన ఓటర్ల జాబితానే స్పష్టం చేస్తుంది. కొత్తగా 17,68,873 మంది కొత్తగా నమోదుచేసుకోగా.. 18-19 ఏండ్లలోపు ఉన్న వారు 5,75,500 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. దీని ప్రకారం మొత్తం కొత్త ఓటర్ల నమోదులో యువత దాదాపు 32.53 శాతం నమోదయినట్టు వివరాలను ఎన్నికల కమిషన్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7న జరిగే అసెంబ్లీ ఎన్నికలో, వచ్చే ఏడాది ఏప్రిల్/ మేలో నిర్వహించే పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం యువత టీఆర్‌ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నదని స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.