ప్రేమ వివాహానికి సహకరించాడని యువకుడి దారుణహత్య

జయశంకర్ భూపాలపల్లి: ప్రేమ వివాహానికి సహకరించాడన్న నెపంతో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎడపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. సీఐ రంజిత్‌కుమార్ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరానికి చెందిన సంగిశెట్టి కిశోర్ (24), విజయనగరానికి చెందిన నర్సింహమూర్తి ఎడపల్లి శివారులో ఏర్పాటుచేసిన బ్రాహ్మణపల్లి-2 క్వారీలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన గోగుల లలిత, నర్సింహమూర్తి ఇద్దరూ ప్రేమించుకుని గ్రామం వదిలివెళ్లారు. దీంతో యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రేమజంట మహదేవపూర్ పోలీసులను సంప్రదించారు. ఇద్దరం మేజర్లమని, ప్రేమించుకున్నామని చెప్పి వివాహం చేసుకున్నారు. అయితే వీరి ప్రేమ వ్యవహారంలో కిశోర్ పాత్ర ఉన్నదని, వారికి పూర్తిస్థాయిలో సహకరించాడని లలిత సోదరుడు విజయ్.. కిశోర్‌ను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఆదివారం రాత్రి ఇసుక క్వారీ వద్ద ఉన్న కిశోర్‌పై విజయ్ గొడ్డలితో దాడిచేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: