యోగేంద్ర యాదవ్ అరెస్ట్

తమిళనాడులో రైతుల ఆందోళనలో పాల్గొనకుండా పోలీసుల కట్టడి న్యూఢిల్లీ: చెన్నై-సేలం ఎక్స్‌ప్రెస్ మార్గం నిర్మాణానికి వ్య తిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనేందుకు వచ్చిన స్వరాజ్ ఇండియా పార్టీ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన తెలుపుతున్న రైతులతోపాటు ఆయననూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రూ.10 వేల కోట్లతో నిర్మించనున్న చెన్నై-సేలం 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిని స్థానిక రైతులు వ్యతిరేకిస్తూ కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నా రు. ఈ రహదారి నిర్మాణం పేరుతో తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, సేకరణ పేరుతో బతకనివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వారితో కలిసి ఆందోళన చేపట్టేందుకు తమిళనాడుకు వచ్చిన యోగేంద్రను తిరువణ్ణామలై వద్ద పోలీసులు అడ్డుకున్నారు. చేంగమ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. ఎక్స్‌ప్రెస్ రహదారిని వ్యతిరేకిస్తున్న రైతులను కలిసేందుకు వెళ్లిన తన పట్ల రాష్ట్ర పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని, మొబైల్ ఫోన్ లాక్కుని తనపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. శాంతిభద్రతల సాకుతో రైతులతో మాట్లాడనీయలేదన్నారు.