కాలేయ మార్పిడుల్లో నూతన అధ్యాయం

నార్మో థర్మిక్ లివర్ పర్ఫ్యూషన్ టెక్నాలజీతో యశోద దవాఖానలో ముగ్గురికి ప్రాణదానం కంటోన్మెంట్, నమస్తే తెలంగాణ: కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల్లో సికింద్రాబాద్‌లోని యశోద దవాఖాన సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. ఆధునిక నార్మోథర్మిక్ లివర్ పర్ఫ్యూషన్ టెక్కాలజీని తొలిసారిగా రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రవేశపెట్టింది. ముగ్గురు లివర్ ఫెయిల్యూర్ రోగులకు కొత్త జీవితం ప్రసాదించింది. ఈ వివరాలను సోమవారం సికింద్రాబాద్ యశోద దవాఖానలో ఎండీ జీఎస్‌రావు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం దాత నుంచి కాలేయాన్ని సేకరించిన తర్వాత 4-8 గంటల్లోనే స్వీకర్త శరీరంలో అమర్చాల్సి ఉంటుందని, తాము ఆవిష్కరించిన టెక్నాలజీతో ఈ సమయాన్ని 24 గంటలకు పెంచవచ్చని చెప్పారు. ఈ పరికరంతో ఇప్పటివరకు ముగ్గురికి విజయవంతంగా కాలేయ మార్పిడి చేశామన్నారు. తమ దవాఖాన సర్జన్ల బృందం ఇప్పటివరకు రెండువేలకుపైగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు.

సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ బాలచంద్రన్ మీనన్ నేతృత్వంలోని వైద్యబృందం నూతన టెక్నాలజీతో ఆపరేషన్లు చేస్తున్నదన్నారు. డాక్టర్ బాలచంద్రన్ మీనన్ మాట్లాడుతూ ప్రస్తుతం దాత నుంచి సేకరించిన కాలేయానికి ఎల్‌ఎఫ్‌టీ, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేస్తున్నారని, దీంతో చాలావరకు కాలేయాలను తిరస్కరిస్తున్నారన్నారు. నార్మోథర్మిక్ పర్ఫ్యూషన్ యంత్రంతో దాత కాలేయపు యదా ర్థ స్థితిని, నాణ్యతను నిర్ధారించవచ్చన్నారు. దీంతో దాత నుంచి సేకరించే కాలేయాల్లో ఉపయోగస్థాయి మరో 30 శాతం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో దవాఖానల ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ చంద్రశేఖర్, ఆర్గాస్‌ఓఎక్స్ లిమిటెడ్ సీఈవో డాక్టర్ క్రెయిగ్ ఆండ్రూస్ మార్షల్ పాల్గొన్నారు.