లక్ష్యసేన్‌కు కాంస్యం

-సెమీఫైనల్లో ఓటమి -ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
మర్హమ్(కెనడా): ప్రతిష్ఠాత్మక ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ కాంస్య పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్యసేన్ 22-20, 16-21, 13-21 తేడాతో కున్వత్ వితిసర్న్(థాయ్‌లాండ్) చేతిలో పోరాడి ఓడాడు. గంటా 11 నిమిషాల పాటు జరిగిన సెమీస్ పోరులో లక్ష్యసేన్ తొలి గేమ్‌ను 22-20తో కైవసం చేసుకుని ఆధిక్యం కనబరిచాడు. కానీ రెండో గేమ్‌లో పుంజుకున్న థాయ్ షట్లర్..సేన్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తనదైన రీతిలో డ్రాప్‌షాట్లు, నెట్‌గేమ్, సుదీర్ఘ ర్యాలీలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ రెండో గేమ్ గెలిచి పోటీలోకొచ్చాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మరింత దూకుడు కనబరిచిన టాప్‌సీడ్ థాయ్ షట్లర్ కున్వత్..లక్ష్యసేన్‌కు ఏ దశలోనూ అవకాశమివ్వలేదు. పాయింట్ల మధ్య అంతరాన్ని అంతకంతకు పెంచుకుంటూ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను తన వశం చేసుకుని ఫైనల్లో ప్రవేశించాడు. మరోవైపు ఈ యేడాది ఆసియా జూనియర్ టైటిల్ గెలిచిన ఈ 17 ఏండ్ల ఉత్తరాఖండ్ షట్లర్..ఆ స్థాయిలో ప్రదర్శన కనబరుచలేకపోయాడు. పూర్తి స్థాయి ఆటతీరును ప్రదర్శించలేకపోయాను. తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ ప్రత్యర్థి కున్వత్ పుంజుకోవడంతో మ్యాచ్ ఫలితం మారిపోయింది. నేను సంధించిన షాట్లకు ధాయ్ షట్లర్ దీటైన సమాధానమివ్వడం ఓటమికి కారణమైంది అని మ్యాచ్ అనంతరం లక్ష్యసేన్ మీడియాతో అన్నాడు. 2008లో పుణెలో జరిగిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సింగిల్స్‌లో హైదరాబాదీ సైనా నెహ్వాల్ స్వర్ణ పతకం గెలువడమే ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శనగా నమోదైంది.