వంటగదిలో ఐదడుగుల కొండచిలువ..

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవలి కాలంలో పాములు, కొండచిలువలు జనావాసాల్లో ప్రత్యక్షమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా కొండచిలువ ఢిల్లీలోని గురుగ్రామ్‌లోని ఓ ఇంటి వంటగదిలోకి ప్రవేశించింది. సుమన్ గౌతమ్ (35) అనే మహిళ బుధవారం ఉదయం ఛాయ్ చేసేందుకని వంటగదిలోకి వెళ్లింది. గ్యాస్ స్టవ్ దగ్గరకు వెళ్లి లైటర్‌తో ముట్టించింది. అదే సమయంలో పక్కన పాత్రలు పెట్టే దాంట్లో ఏదో కదులుతున్నట్లు శబ్దం వినిపించింది. సుమన్ గౌతమ్ పక్కకు తిరిగిచూడగా పాత్రల మధ్యలో ఐదడుగుల కొండచిలువ (ఇండియన్ రాక్ పైతాన్) కనిపించింది. ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది.

ఉదయం 8.40 గంటలకు నా భార్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వంటగదిలో పెద్ద పాము కనిపించిందని భయంతో వణుకుతూ చెప్పింది. నేను వెంటనే జంతు సంరక్షణ విభాగం కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పానని సుమన్ గౌతమ్ భర్త సతీశ్ కుమార్ తెలిపారు. విషయం తెలుసుకున్న సామాజిక జంతు కార్యకర్త గండాస్ గంటలోపు తన ఇంటికి వెళ్లి కొండచిలువను సురక్షితంగా కాపాడారని సతీశ్‌కుమార్ తెలిపాడు. తాజా కొండచిలువతో ఇప్పటివరకు ఢిల్లీలో పట్టుకున్న వాటి సంఖ్య 15కు చేరింది.

× RELATED మృతుడి కుటుంబానికి రూ. 3లక్షలు ఎక్స్‌గ్రేషియా