మోదీని కలవనివ్వలేదని బస్సు తగలబెట్టింది!

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన సందర్భంగా ఆయనను కలిసే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేసిన ఓ మహిళ ఏకంగా బస్సునే తగలబెట్టింది. ప్రయాణికులతో లక్నో వెళ్తున్న బస్సుకు ఆమె నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు. మంటలు పూర్తిగా వ్యాపించేలోపే ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు వచ్చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కంటోన్మెంట్ బస్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి వందన రఘువన్షి అనే ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఎన్నో రోజులుగా ఉత్తరప్రదేశ్ నుంచి పూర్వాంచల్‌ను వేరు చేయాలని డిమాండ్ చేస్తున్నది.

బస్సు కనిపించగానే ఆమె దానిపై పెట్రోల్ చల్లి నిప్పంటించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనలో బస్సు మొత్తం కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్వాంచల్ రాష్ట్రం ఏర్పాటుచేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ వందన ఆగస్ట్ 15 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆగస్ట్ 29న బలవంతంగా దీక్ష భగ్నం చేసినట్లు వారణాసి ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు.

Related Stories: