కిలాడీ లేడీ అరెస్ట్

హైదరాబాద్ : తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడే వస్త్రధారణ ఫొటోలతో విదేశీ పెండ్లి కొడుకులకు గాలం వేస్తున్న ఓ కిలాడీ లేడీని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ ప్రాంత పరిధిలో నివాసం ఉంటున్న ఓ తల్లిదండ్రులు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న కుమారుడి కోసం మ్యాట్రిమోని సైట్‌లో వధువు కోసం వెతికారు. అందులో పుష్తాయి పేరుతో ఉన్న ఓ యువతి ప్రొఫైల్‌ను నచ్చారు. ప్రొఫైల్‌లోని ఫోన్ నంబర్‌కు సంప్రదించి తమ కుమారుడితో వివాహం చేసేందుకు నిర్ణయించుకున్నామని మీ పెద్దలతో మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుదామని యువతికి ఫోన్‌లో చెప్పారు.ఆ సమయంలో వరుడు ఫోన్ నంబరును తీసుకొని ప్రతిరోజు వాట్సాప్ చాటింగ్ చేసింది. ఇలా వరుడి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించింది. నిశ్చితార్దానికి బంగారు ఉంగరం బదులుగా ప్లాటినమ్ ఉంగరం కావాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను అంగీకరించిన అతను యువతి ఖాతాలోకి లక్షన్నర రుపాయలను పంపాడు. అంతే ఇక అతనితో మాట్లాడడం బంద్ చేసింది. అతని తల్లిదండ్రులు కూడా సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. చెన్నైలోని ఆమె ఇంటికి వస్తామని చెప్పినా పట్టించుకోలేదు. చివరకు మోసపోయామని చెప్పి వరుడి తల్లిదండ్రులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విలాసాల కోసం..సైబర్ ఛీటర్ అయ్యింది

ఈ ఫిర్యాదును దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రాథమికంగా పలు ఆధారాలు సేకరించి మోసం చేసిన యువతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన కోరం అర్చనగా గుర్తించారు.ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన కోరం అర్చన ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎమ్‌బీఏ పూర్తి చేసి 2016లో ఓ లెక్చరర్‌ను పెండ్ల్లి చేసుకుంది. పాప పుట్టిన తర్వాత భర్త వదిలేయడం, విలాసాలకు అలవాటు పడడంతో అర్చన తన తెలివితేటలతో జూటూరీ వరప్రసాద్ అర్చన, ఇందిర ప్రియదర్శిని, పుష్తాయిగా చలామణీ అవుతూ విదేశీ పెండ్లి కొడుకులను టార్గెట్ చేసిందని దర్యాప్తులో తెలిసింది. ఈ విధంగా నేరాలకు పాల్పడి 2018లో రాచకొండ, సైబరాబాద్ పోలీసులకు ఇదే నేర ప్రక్రియతో మోసాలకు పాల్పడి చిక్కింది. ఐదు నెలల పాటు జైలుకు వెళ్లి బయటికి వచ్చింది. మరోసారి అదే నేర ప్రక్రియతో రాచకొండ, సైబరాబాద్‌లో 5.50 లక్షలకు టోకరా కొట్టి మళ్లీ దొరికిపోయింది.

గూగుల్ నుంచి ఫొటోలు.. యాప్‌ల నుంచి వాయిస్‌లు..

ఈ నేర ప్రక్రియను అలవాటు చేసుకున్న అర్చన మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ను నమోదు చేసుకొనే సమయంలో గూగుల్ నుంచి పలువురి అమ్మాయిల ఫొటోలను డౌన్‌లోడ్ చేసుకుని వాటితో వరుడికోసం దరఖాస్తు చేసుకుంటుంది. వాటిని చూసి బోల్తాపడే వారిని మరింతగా ఆకట్టుకునేందుకు గొంతులు మార్చి మాట్లాడేందుకు పలు యాప్‌ల సహాయం తీసుకుంటుందని తెలిసింది. ఇలా అర్చన సంబంధాన్ని పక్కా చేసుకుంటున్నట్లు నమ్మించేందుకు తల్లిగా, యువతిగా, తండ్రిగా మాట్లాడి మాయ చేసిందని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. పలు సందర్భాల్లో ఉద్యోగ నిమిత్తం నగరానికి వచ్చానని నమ్మించి డబ్బులు కూడా వసూలు చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె నుంచి 10 బ్యాంక్ పాసు బుక్‌లు, 16 చెక్ బుక్‌లు, 34 ఏటీఎమ్ కార్డులు, పాన్ కార్డులు-2, 7 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.మ్యాట్రిమోని సైట్‌ల నుంచి ఫ్రొఫైల్ ఎంపిక సమయంలో జాగ్రత్తగా ఉండాలని, కేవలం వాట్సాప్ చాటింగ్, ఫోన్‌ల పలకరింపులతోనే నమ్మి డబ్బులు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Related Stories: