తిరుగులేని న'విన్'.. వ‌రుస‌గా ఐదోసారి ముఖ్యమంత్రిగా..

భువనేశ్వర్: ఒడిశాలో సార్వత్రిక ఎన్నికల పోరు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ), బిజు జనతాదళ్(బీజేడీ) మధ్యనే ఉంటుందని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో బీజేడీకి 2014 కన్నా తక్కువ సీట్లు వస్తాయని.. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 74ను అందుకోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేశారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్(72) రికార్డు స్థాయిలో ఐదోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్నారు. ఆ రాష్ట్ర ప్రజలను ఆయన్ను మరోసారి భారీ మెజార్టీతో ఆశీర్వదించారు. ఒడిశాను గత 19ఏళ్లుగా పాలిస్తున్న ఆయన అనుభవానికే అక్కడి ప్రజలు మద్దతు పలికారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాల్లో 146 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేడీ 103 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 29, కాంగ్రెస్ కూటమి 14 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇదే తరహాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాల్లో బీజేడీ 14 ఎంపీ సీట్లలో ముందంజలో ఉండగా.. బీజేపీ ఏడింట్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. సంచలన ఫలితాలతో ఒడిశా రాజకీయాల్లో నవీన్ తిరుగులేని నేతగా అవతరించారు.