కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరేసుకుంటా!

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే తాను ఉరేసుకోవడానికి కూడా సిద్ధమేనని అన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదు. ఒకవేళ అదే జరిగితే నేను ఉరేసుకోవడానికి కూడా సిద్ధం అని కృష్ణమూర్తి స్పష్టంచేశారు. కర్నూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం కూడా కాదని, పార్టీ తరఫునే మాట్లాడుతున్నాను అని కూడా ఆయన చెప్పడం గమనార్హం.

ఇక ఏ పొత్తయినా ఎన్నికల ముందే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈ మధ్య కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబు.. రాహుల్, సోనియాలతో కలుపుగోలుగా ఉండటంతో టీడీపీ క్రమంగా కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ప్రకటించారు. అంతేకాదు చంద్రబాబుతోపాటు బెంగాల్ సీఎం మమతను కూడా కాంగ్రెస్‌తో చేతులు కలపాల్సిందిగా కోరినట్లు ఈ మధ్యే కర్ణాటక సీఎం కుమారస్వామి కూడా చెప్పారు.

Related Stories: