లోక్‌సభ బరిలో మాధురి దీక్షిత్

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నెనే (51) రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పుణే నియోజకవర్గం నుంచి మాధురిని బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నది. ఈ మేరకు మహారాష్ట్రలో పోటీచేయనున్న పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే ప్రక్రియను ఇప్పటికే కమలనాథులు ప్రారంభించారు. బీజేపీ తరఫున పోటీచేయనున్న అభ్యర్థుల జాబితాలో మాధురి పేరు ఉన్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. 2019 ఎన్నికల్లో మాధురి దీక్షిత్‌ను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నది. ఇందులో భాగంగా పుణే నియోజకవర్గం ఆమెకు తగినదని పార్టీ భావిస్తున్నది. రాష్ట్రంలో పోటీచేసే స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పుణేలో మాధురి అభ్యర్థిత్వాన్ని పార్టీ తీవ్రంగా పరిశీలిస్తున్నది అని సదరు నేత పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న పుణే స్థానం నుంచి 2014 ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి అనిల్ శిరోలి మూడు లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో కొత్త ముఖాలకు స్థానం కల్పించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. గతంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించి అనూహ్య ఫలితాలు సాధించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరించి విజయం సాధించాలనే యోచనలో కమలనాథులు ఉన్నారు.

Related Stories: