వివాహేతర సంబంధం మానుకోవడం లేదంటూ...

హైదరాబాద్ : వివాహేతర సంబంధం మానుకోవాలంటూ పలుమార్లు చెప్పినా వినకపోవడంతో భార్యను కిరాతకంగా హత్య చేశాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శారదానగర్ ప్రాంతానికి చెందిన మల్లవల్లి ప్రశాంత్(40) కారు డ్రైవర్. అతడికి భార్య జ్యోత్స్న(31), కొడుకులు రణధీర్(9), రుత్విక్(8) ఉన్నారు. కాగా.. రెండేండ్ల్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జ్యోత్స్న భర్తపై కేసు పెట్టి.. పిల్లలతో వెళ్లిపోయి ఉయ్యూరులోని గ్రేస్ దవాఖానలో పనిచేస్తున్నది. కాగా.. అప్పటినుంచి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త పలుమార్లు హెచ్చరించాడు. పెద్దల జోక్యంతో కేసులో రాజీ పడ్డ భార్యాభర్తలు తిరిగి కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు మంగళవారం తెల్లవారుజామున వచ్చి బంజారాహిల్స్ రోడ్ నం.10లోని అవర్‌ప్లేస్ సమీపంలో ఉన్న బంధువు ప్రకాశ్ ఇంటికి వెళ్లారు. రాత్రంతా వేరేవ్యక్తితో చాటింగ్ చేస్తున్నావని, పద్దతి మార్చుకోవాలంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించడంతో మాటామాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రశాంత్ భార్య జ్యోత్స్నను రోకలిబండతో తలపై బాదాడు. దీంతో అక్కడికక్కడే జ్యోత్స్న మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
× RELATED ఆహ్లాదం...ఆనందం..ఆరోగ్యం..