ధోనీ రిటైరవుతున్నాడా.. బాల్ ఎందుకు తీసుకున్నాడు?

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ఓడిపోయిన తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ చేసిన ఓ పని ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. ధోనీ త్వరలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ఓడిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ధోనీ అంపైర్ల దగ్గర నుంచి మ్యాచ్ బాల్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అతడు ప్రత్యేకంగా అడిగి ఆ బాల్‌ను ఎందుకు తీసుకున్నాడు అన్న సందేహం అభిమానులు వ్యక్తంచేస్తున్నారు. త్వరలోనే ధోనీ రిటైరవుతున్నాడని, ఏషియా కప్ అతని చివరి టోర్నీ అని, ఇంగ్లండ్‌లో ఇక ధోనీ ఆడబోవడం లేదని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ట్వీట్ చేశారు. ధోనీ ఇప్పటికే టెస్టుల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. అతడు 321 వన్డేలు. 93 టీ20లు ఆడాడు. ఈ సిరీస్‌లోనే వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. ప్రస్తుతం 321 వన్డేల్లో 51.25 సగటుతో 10046 పరుగులు చేశాడు. అందులో పది సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో 37.17 సగటుతో 1487 పరుగులు చేయగా.. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
× RELATED న్యాక్‌లో ఏడు వృత్తుల్లో కొత్త బ్యాచ్‌లు ప్రారంభం