గూగుల్, ఫేస్‌బుక్‌పై కత్తి నూరుతున్న వైట్‌హౌస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల పట్ల మీడియాకు మాత్రమే కాకుండా పెద్దపెద్ద కంపెనీలకూ వ్యతిరేకత ఉంది. ఆయన దుందుడుకు విధానాలు దేశాన్ని భ్రష్టు పట్టించి, నాశనం చేస్తాయని నమ్మేవారు ఇప్పుడు ఎక్కువయ్యారు. అందులో గూగుల్, ఫేస్‌బుక్ కూడా ఉన్నాయి. ట్రంప్ విధానాలను సాంకేతికంగా ప్రతిఘటించడం ఎలా అని గూగుల్ ఒకదశలో సీరియస్‌గా సమాలోచనలు జరిపినట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. అయితే అలాంటి ఆలోచన ఏదీ లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచ్చయ్ శుక్రవారం వివరణ ఇచ్చుకున్నారు. ఫేస్‌బుక్‌తో కూడా ట్రంప్ సర్కారుకు గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ బ్రహ్మాస్ర్తాన్ని సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. గూగుల్, పేస్‌బుక్ లంటి కంపెనీల వ్యాపార లావాదేవీలపై దర్యాప్తు జరపాలని ఆదేశించే అధ్యక్ష ఫర్మానా సిద్ధమైందట.

ట్రంప్ సంతకం చేస్తే ఇక అమలు చేయడమే తరువాయి. ఆ ఫర్మానా అమలైతే రెండు కంపెనీలకు చిక్కులే. అవి పెద్దఎత్తున అవకతవకలకు పాల్పడ్డాయని కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయనో, దేశ భద్రతకు ముప్పుతెచ్చే పనులు చేపడుతున్నాయనో అస్పష్టమైన ఆరోపణలతో కేసులు పెడితే కష్టమే. అయితే ఫర్మానాలో ఏ కంపెనీ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ ఆ రెండు కంపెనీలపై ట్రంప్ బహిరంగంగానే ఆరోపణలు చేశారు. రిపబ్లికన్ పార్టీ ప్రాతినిధ్యం వహించే ఛాందసభావాలను అవి అణగదొక్కుతున్నాయని ట్రంప్ అంటున్నారు. సోషల్ మీడియా రిపబ్లికన్/చాందసవాద వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని గత ఆగస్టులో ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు. ఈ సరికే వివిధ రాష్ర్టాలు విడివిడిగా సోషల్ మీడియాపై ఉచ్చు బిగిస్తున్నాయి. ఇక అధ్యక్ష ఫర్మానా జారీ అయితే గుండుగుత్తగా వాటిని వేధించేందుకు లైసెన్స్ దొరికినట్టు అవుతుంది. మరి న్యాయస్థానాలు ఈ ఫర్మానాపై ఏరకంగా స్పందిస్తాయో చూడాలి.

Related Stories: