నకిలీ వార్తలకు వ్యతిరేకంగా వాట్సప్ రేడియో ప్రచారం

నకిలీ వార్తలపై వాట్సప్ మరోసారి కొరడా ఝళిపించింది. రకరకాల సమస్యలకు కారణమవుతున్న ఫేక్‌న్యూస్‌కు వ్యతిరేకంగ రేడియో ప్రచారాన్ని మరింత విస్తృతం చేసింది. రెండో విడత రేడియో ప్రచారాన్ని తెలంగాణ, ఏపీతో సహా 10 రాష్ర్టాల్లో బుధవారం నుంచి ప్రారంభించింది. దేశంలో మూకుమ్మడి దాడులకు వాట్సప్ సందేశాలు కారణం కావడంపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కంపెనీ ఈ చర్యలు చేపట్టింది. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, తెలుగు, ఒరియా, తమిళ భాషల్లో ఫేక్‌న్యూస్ గురించి ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారాన్ని వాట్సప్ మొదలుపెట్టింది.

సామాన్యులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రచారాన్ని రూపొందించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సందేశం పంపినవారి ఆచూకీ పట్టిచ్చే ఏర్పాటు ఉండాలన్న ప్రభుత్వ డిమాండ్ మాత్రం వాట్సప్ ఆమోదించలేదు. ఇది వినయోగదారు ఏకాంత హక్కు భావనకు విరుద్ధమనేది కంపెనీ వాదన. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టకపోతే వాట్సప్‌ను అల్లర్లు ఎగదోసిన శక్తిగా భావించి చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. దాంతో వాట్సప్ నకిలీ వార్తల వ్యతిరేక ప్రచారాన్ని భారీ స్తాయిలో చేపట్టింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో పౌర సమాజం, ప్రభుత్వం, భాగస్వాములతో కలిసి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వాట్సప్ బుధవారంనాటి ప్రకటనలో స్పష్టం చేసింది.

× RELATED 16 మంది సీఎంలు పాలించినా అభివృద్ధి శూన్యం