ఊరు పేరు మార్పుతో పాఠశాల అనుమతి రద్దు

కోల్‌కతా: అనుమతి లేనిదే పేరు మార్చారన్న కారణంగా ఓ పాఠశాల అనుమతిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. దినాజ్‌పూర్ జిల్లాలో విద్యాభారతి ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల నిర్వహణ జరుగుతుంది. ఈ పాఠశాల అడ్మిషన్ నోటీస్‌లో ఇస్లాంపూర్‌కు బదులుగా ఈశ్వర్‌పూర్‌గా నమోదు చేశారు. ఈ విషయం వివాదానికి దారితీయడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. విద్యాశాఖ పరిధిలో ఉన్న పాఠశాల ఎలా తన అనుమతి లేకుండా ఇస్లాంపూర్‌ను ఈశ్వర్‌పూర్‌గా మార్చిందో నివేదిక సమర్పించాల్సిందిగా పేర్కొన్నారు. సెంకడరీ ఎడ్యూకేషన్‌కు చెందిన అధికారుల బృందం స్కూల్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పాఠశాలకు సంబంధించిన పత్రాలతో తిరిగి వెళ్లారు. ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. అన్ని అధికారిక రికార్డుల్లో ఇస్లాంపూర్‌నే నమోదు చేస్తామన్నారు. కొన్ని అడ్మిషన్స్ నోటీసుల్లో మాత్రమే ఈశ్వర్‌పూర్‌గా నమోదైనట్లు తెలిపారు. ఎందుకంటే స్థానికంగా ఇస్లాంపూర్‌ను ఈశ్వర్‌పూర్‌గా పిలిచే విషయం అందిరికే తెలిసిందేనన్నారు. బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ చర్యలు తీసుకుంటూ పాఠశాల అనుమతిని రద్దు చేసింది. దీంతో స్కూల్లో చదువుతున్న మొత్తం 500 మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొందన్నారు. ఏబీవీపీ విద్యార్థి నేత బిమల్ దాస్ స్పందిసూ.. స్కూల్ అనుమతి రద్దు విషయాన్ని తాము కొల్‌కతా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించారు. బస్సు ఎక్కి కండక్టర్‌తో మీరు ఈశ్వర్‌పూర్‌లో దించాల్సిందిగా అడిగినా అతడు ఇస్లాంపూర్‌లోనే దించుతాడన్నారు. స్థానికులకు ఈ పేర్లు చాలా సాధారణం అన్నారు.

Related Stories: