బలహీనపడిన రుతుపవనాలు పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నైరుతి రుతుపవనాలు బలహీనపడ్డాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు లేకపోవడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. ఫలితంగా నాలుగురోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే దాదాపు రెండు డిగ్రీల వరకు ఉష్ణోగత్రలు పెరిగాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మందగమనంలో ఉన్నాయన్నారు. అల్పపీడన ద్రోణి, ఆవర్తనాలు ఏర్పడితే తిరిగి రుతుపవనాలు బలం పుంజుకోవచ్చని అన్నారు. దక్షిణ కర్ణాటక నుంచి కొమోరియన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినప్పటికీ.. దాని ప్రభావం తెలంగాణపై లేదని రాజారావు చెప్పారు.