అవినీతిని ఉపేక్షించం : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : దేశంలో అవినీతిని ఉపేక్షించమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. అవినీతిపరులు, నల్ల ధనాన్ని పూర్తిగా అరికట్టగలిగాం అని చెప్పారు. పౌరసరఫరా శాఖలో అవకతవకలను అరికట్టి రూ. 90 వేల కోట్లు ఆదా చేశామని గుర్తు చేశారు. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాం. పన్నుదారుల సొమ్మును మంచి పనులకే ఉపయోగిస్తాం. నిజాయితీగా పన్ను చెల్లించే వారి వల్లే దేశం ముందడుగు వేస్తుందన్నారు. ఒక్కరు పన్ను చెల్లిస్తే కనీసం మూడు కుటుంబాల ఆకలి తీరుతుందన్నారు మోదీ. ఇంతకంటే మానవసేవ ఏముంటుందని? మోదీ ప్రశ్నించారు. అవినీతి రహిత భారత్ కోసం పౌరులంతా సహకరిస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో పవర్ బ్రోకర్ల ఆనవాళ్లు లేకుండా చేయగలిగాం. పైరవీకారులు ఎలా ఉంటారో ఢిల్లీలో కనబడకుండా చేశాం. అవినీతి అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకునేలా చర్యలు చేపడుతున్నామని మోదీ చెప్పారు. అవినీతికి పాల్పడాలంటేనే భయపడేలా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తొలిసారిగా ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఇది భారతీయ మహిళల శక్తికి నిదర్శనమని మోదీ చెప్పారు. స్వల్పకాల సర్వీస్ కమాండ్‌లో పని చేస్తున్న మహిళలకు పురుషులతో సమాన హోదా కల్పించామన్నారు. క్రీడల నుంచి పార్లమెంట్ దాకా మహిళలు దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. మహిళలపై నేరాలు చేసే రాక్షస శక్తులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టలు రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్‌తో ఎంతో మంది ముస్లిం మహిళలకు అన్యాయం జరిగింది. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలను రక్షించేందుకు బిల్లు తీసుకువస్తున్నామని మోదీ తెలిపారు.
× RELATED ఛత్తీస్‌గఢ్‌లో రేపు రెండో విడత పోలింగ్