ఈ ఘన విజయం దేశప్రజలకు అంకితం: మోదీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో బీజేపీకి దక్కిన ఈ ఘన విజయం దేశ ప్రజలకు అంకితమని ప్రధాని మోదీ అన్నారు. స్వాతంత్య్రం తర్వాత బీజేపీకి ప్రజలు భారీ విజయం అందించారని మోదీ అన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చాం. కష్టాలకు వెనకడుగు వేయని పార్టీ శ్రేణులను చూసి గర్విస్తున్నానన్నారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..మండుటెండల్లో కూడా తరలివచ్చి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. నన్ను మరోసారి ఆశీర్వదించి, అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారత్ ఒక ప్రజాస్వామ్య శక్తి అని ప్రపంచదేశాలు గుర్తించాలి. పోలింగ్ ప్రక్రియలో పాలు పంచుకున్న ఈసీ, భద్రతా బలగాలు, ప్రజలకు అభినందనలు. 130 కోట్ల మంది ప్రజలు దేశం పక్షాన నిలిచారు. దేశం బాగు కోసమే వెల్లువలా తరలివచ్చి బీజేపీ ఓటేశారు. ఇప్పటివరకు ఎన్నో ఎన్నికల జరిగినా..ఇంతటి ఘనవిజయం దక్కలేదని మోదీ అన్నారు.