వచ్చే ఏడాది ఐపీఎల్ ఎక్కడో తెలుసా?

ముంబై: వచ్చే ఏడాది జరగబోయే ఇండియన్ ప్రిమియర్ లీగ్ 12వ ఎడిషన్ మరోసారి ఇండియా దాటి వెళ్లనుంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఇండియాలో టోర్నీ నిర్వహణ సాధ్యం కాదు. 2009లో తొలిసారి ఇలాగే దేశం దాటి వెళ్లాల్సి వచ్చినపుడు సౌతాఫ్రికా టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఇప్పుడు 2019లోనూ మరోసారి టోర్నీ నిర్వహణకు సౌతాఫ్రికా ఆసక్తి చూపుతున్నది. ఇప్పటికే బీసీసీఐ కూడా మరో వేదికను వెతికే పనిలో ఉంది. అయితే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని బోర్డు భావిస్తున్నది. ఆలోపే తాము టోర్నీ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా చెప్పడం విశేషం. వాళ్లు సౌతాఫ్రికా రావాలని అనుకుంటే మేము కచ్చితంగా ఓకే చెబుతాం. ఐపీఎల్ నిర్వహణకు మేం సిద్ధంగా ఉన్నాం అని సీఎస్‌ఏ సీఈవో తబాంగ్ మోరో స్పష్టంచేశారు.

అయితే భారత ప్రభుత్వం ఎన్నికల తేదీలను ప్రకటించే వరకు ఇదంతా ఒట్టి పుకారుగానే ఉంటుంది. కానీ బీసీసీఐ మాత్రం టోర్నీని సౌతాఫ్రికా లేదా దుబాయ్‌కు తరలించాలని భావిస్తున్నది అని మోరో చెప్పారు. ఒకవేళ తమ దేశానికి వస్తే మాత్రం ముందుగానే ఆ పనుల కోసం సిద్ధమవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19 వరకు ఐపీఎల్ జరగనుంది. అయితే దాదాపు అవే తేదీల్లో దేశంలో వివిధ విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

× RELATED ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి