బతుకమ్మ చీరలొచ్చాయి..

- ఆడబిడ్డలకు సర్కారు కానుక - 3.58లక్షల మందికి అందజేత - ఈ నెల చివరి వారంలో పంపిణీ సుబేదారి: తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక. స్వరాష్ట్రం సాధించుకున్నాక బతుకమ్మకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. సబ్బండవర్ణాల మహిళలు జరుపుకునే ఈ పండుగకు ప్రభుత్వమే సకల ఏర్పాట్లు చేస్తూ వస్తున్నది. చేనేత కార్మికులకు చేయూతనందించడంతోపాటు ప్రతీ ఆడపడుచు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం బతుకమ్మ చీరను అందించాలని నిర్ణయించింది. తెల్ల రేషన్‌కార్డు కలిగి, 18 సంవత్సరాలు నిండిన మహిళకు బతుకమ్మ చీరను అందించేందుకు 2017లో శ్రీకారం చుట్టింది. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు పన్నినా..బతుకమ్మ పండుగను ఏటా విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో ఈసారి కూడా వరంగల్ అర్బన్ జిల్లాలో పెద్ద ఎత్తున చీరెల పంపిణీ కార్యక్రమానికి జిల్లా అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాకు 3.50లక్షల చీరెలు అవసరం ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి జాబితా పంపించారు. దీంతో ప్రభుత్వం కావాల్సిన చీరెలను జిల్లాకు చేరవేస్తోంది. అర్హులు 3.58 లక్షలు జిల్లాకు 3.58లక్షల మంది 18 ఏళ్ల పై బడిన మహిళలు ఉన్నారని అధికారులు గుర్తించారు. జిల్లాలోని ధర్మసాగర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హన్మకొండ, హసన్‌పర్తి, వేలేరు, ఐనవోలు, కమలాపూర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బతుకమ్మ చీరలకు 3.58లక్షల మంది అర్హులుగా గుర్తించారు. గతేడాది జి ల్లా పరిధిలో 3.50లక్షల మందికి చీరలు అందజేశారు. ఈసారి మరో 8వేల మందికి అర్హులుగా తేలారు. జిల్లాకు చేరిన చీరలు బతుకమ్మ చీరలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వారం రోజుల క్రితం నాలుగు లారీల్లో రెండు లక్షల చీరలు వచ్చాయి. వీటిని డీఆర్డీఏ అధికారులు ఏనుమాముల మార్కెట్ గోదాంలో భద్రపరిచారు. మరో వారం రోజుల్లో మిగతా లక్షలన్నర చీరలు జిల్లాకేంద్రానికి చేరుతాయని అధికారులు తెలిపారు. చీరల పంపిణీ ఈ నెల చివరి వారంలో చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈమేరకు అధికారులు గ్రామాలు, నగరంలో డివిజన్ల వారీగా జాబితాను రూపొందించారు. పంపిణీ ఇలా.. రేషన్ కార్డు ఆధారంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరను అందజేయనున్నారు. సివిల్ సప్లయీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా గ్రామాలు, మండలాలు, డీలర్ల షాపుల వారీగా చీరలను క్షేత్రస్థాయికి పంపిస్తారు. లబ్ధిదారులు తమరేషన్ కార్డును వెంట తీసుకుని నిర్ణీత కేంద్రానికి వెళ్లి అక్విటెన్స్‌పై సంతకం చేసి చీరలను తీసుకోవాలి.

Related Stories:

More