ఆర్టీఐని పకడ్బందీగా అమలు చేయాలి

అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 13: సమాచార హక్కు చట్టం-2005ను పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కృతనిశ్చయంతో పనిచేయాలని, అడిగిన సమాచారాన్ని చట్టంలోని నిబందనలకు లోబడి దరఖాస్తుదారులకు ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ దయానంద్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ శాఖల అధికారులతో కార్యాలయాల్లో ఆర్‌టీఐపై నిర్వహిస్తున్న రికార్డులు, విధి విధానాలపై సమాచార హక్కు చట్టం-2005పై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005 ద్వారా సమాచారం కోరడం ప్రజలకు కల్పించిన హక్కు అని అన్నారు. సామాన్యులకు ఆయుధం వంటిదని ఆయన పేర్కొన్నారు. ఇతర వ్యక్తుల హక్కులను హరించే విధంగా ఉన్నయెడల అట్టి సమాచారం ఇవ్వరాదన్నారు. ప్రతి కార్యాలయంలో ఒక పీఐవోను నియమించుకోవాలని సూచించారు. ఈ చట్టంపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని అన్నారు. కార్యాలయాల్లో వచ్చే దరఖాస్తుల నమోదుకు సంబందిత ప్రొఫార్మాతో రెండు రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. ఆర్టీఐ నిర్వహణపై ప్రగతి నివేదికలను త్రైమాసికానికి ఒకసారి ఆర్టీఐ కమిషన్‌కు పంపించాలన్నారు. నిర్ధేశించిన సమయంలో అడిగిన సమాచారం అందించేందుకు కృషి చేయాలని, లేనిపక్షంలో దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు లోకాయుక్తకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. దరఖాస్తుదారుల నుంచి వచ్చే సొమ్మును జమ చేసేందుకు బ్యాంకు అకౌంటును ప్రారంభించవచ్చన్నారు. చట్టం నిర్వహణపై అన్ని శాఖల అధికారులకు త్వరలోనే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు జేసీ తెలిపారు. వాణి సేవా సొసైటీ స్వచ్ఛంద సంస్థ కమిటీ సభ్యుడు పొట్లపల్లి వీరభద్రరావు మాట్లాడుతూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రజలు అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఇబ్బందికరమైన దరఖాస్తులు వస్తే నిపుణులను సంప్రదించాలని సూచించారు. చట్టంలో 2013లో కొన్ని సవరణలు చేశారని, ఆర్టీఐ పుస్తకాలను చదివి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ప్లీడర్, కమిటీ సభ్యుడు సోమేశ్వర్‌రావు మాట్లాడుతూ శాఖా పరిధిలో సమాచారం కోసం దరఖాస్తు చేస్తే సంబందిత శాఖలకు బదిలీ చేయవచ్చన్నారు. సమాచారం ఇచ్చేటప్పుడు ఒరిజనల్ ఫైళ్లను సరిచూసుకొని ఇచ్చే ప్రతీ పేపరుపై సంతకం చేసి ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు సమాచార హక్కు చట్టం దరఖాస్తులతో వచ్చే సమస్య ఇవ్వాలా, వద్దా అనే అంశాల ను కమిటీ దృష్టికి తెచ్చారు. సమావేశంలో డీఆర్‌వో పీ మో హన్‌లాల్, జెడ్పీ సీఈవో ప్రసూనరాణి, ఆర్డీవో కే వెంకారెడ్డి, మెప్మా పీడీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Related Stories:

More