వైభవంగా మహాకుంభాభిషేకం

-స్వరూపానందేంద్ర చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం -ఆశీర్వచనం పొందిన మేయర్ ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ హన్మకొండ రూరల్, జూన్12: హరిహర క్షేత్రం (అయ్యప్ప స్వామి దేవాలయం) ఆరెపల్లిలో బుధవారం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా సహస్త్రపాద శ్రీ మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ, అయ్యప్పస్వామి మహా కుంభాభిషేకం నిర్వహించారు. పండితుల వేద మంత్రాలతో, భక్తుల శరణుఘోషతో దేవాలయ ప్రాంగణం మార్మోగింది. మూడు రోజులుగా అయ్యప్ప స్వామి ఆలయంలో లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్ఠాపన కోసం భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకుడు శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి దేవాలయంలోని గణపతి, మహేశ్వర, సుబ్రమణ్యమూర్తుల దర్శనం చేసుకొని అయ్యప్ప స్వామికి కుంభాభిషేకం చేశారు. కార్యక్రమానికి ఆహ్వానించిన కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు, ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మేయర్ గుండా ప్రకాశ్‌రావుకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ధర్మకర్తలు ఇట్టా రమేశ్, సురేశ్‌ను ఆయన అభినందించారు. అనంతరం స్వరూపానంద సరస్వతికి ధాన్య, ఫల, పుష్పాలతో భిక్షా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీష్‌కుమార్, మేయర్ గుండా ప్రకాశ్‌రావు, ఆలయ ధర్మకర్తలు అందించారు. కార్యక్రమంలో హరిహర క్షేత్రం ఆలయ ప్రధాన అర్చకులు పద్మనాభశర్మ వెంకటేశ్వర్లు, సంతోష్, తోట శంకర్‌రావు, గుమ్మడవల్లి రమేశ్, వజ్జీర్ కిషన్, పూర్ణచందర్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. ఐశ్వర్యం.. సంతానం రెండూ ఇచ్చేది లక్ష్మీదేవి ఐశ్వర్యం.. సంతానం రెండూ అందించే దయగల తల్లి లక్ష్మీదేవి అని, అలాంటి తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన చేయడం, అయ్యప్ప స్వామికి తన చేతులమీదుగా కుంభాభిషేకం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని స్వరూపానందేంద్రస్వామి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. ధర్మబద్ధ్దమైన జీవనం వ్యక్తికి ఔన్నత్యాన్ని కలిగిస్తుందన్నారు. దైవ చింతన వలన వ్యక్తిలో కలిగే ఆనందం అత్యంత గొప్పదని, ఆ విధమైన జీవితాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. 18 ఏళ్లకోసారి ప్రధాన ఘట్టం అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రతీ 18 సంవత్సరాలకు ఒక ప్రధాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ ధర్మకర్త ఇట్టా రమేశ్ బాబు తెలిపారు. ఆలయ నిర్మాణం 36 ఏళ్ల క్రితం తమ తండ్రి ఇట్టా రాజేంద్రబాబు సద్గురు శివానందమూర్తులు ప్రోత్సాహంతో, చినజీయర్ స్వామి చేతులమీదుగా ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి ఆలయంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అయ్యప్పస్వామి పడిమెట్లు 18 ఉన్నందున ప్రతీ పద్దెనిమిది ఏళ్లకోసారి యాదృచ్ఛికంగా ఒక భగవత్ కార్యం జరుగుతోందన్నారు.

Related Stories: