26న జలవిహార్‌లో బాలస్వామి పరిచయ వేదిక

-విశాఖ శారదా పీఠాధిపతి - స్వరూపానందేంద్ర సరస్వతి వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారిగా బాలస్వామి (కిరణ్‌కుమార శర్మ) ఈనెల 15, 16, 17 తేదీల్లో విజయవాడలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో సన్యాసాశ్రమ స్వీకార మహోత్సవం తర్వాత ఈనెల 26న హైదరాబాద్‌లోని జలవిహార్‌లో బాలస్వామి పరిచవేదికను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వెల్లడించారు. కృష్ణానదీ తీరంలో (విజయవాడ) సన్యాస స్వీకార మహోత్సవానికి, హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగే బాలస్వామి పరిచవేదిక కార్యక్రమానికి సర్వజనులు రావాలని ఆయన ఆహ్వానించారు. విజయవాడలో జరిగే కార్యక్రమానికి తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సహా అనేక మంది భక్తిపుంగవులు, రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు, ఆధ్యాత్మిక, రాజనీతి, కళారంగాలకు చెందిన ప్రముఖులు, దేశదేశాల నుంచి అనేక మంది వస్తున్నారన్నారు. బుధవారం హన్మకొండలోని ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖ శ్రీ శారదాపీఠం సర్వజనోద్ధరణ కోసం అనాది నుంచి పాటుపడుతోందన్నారు. తెలుగు ప్రజలు ప్రపంచంలో సుభీక్షంగా, సుఖవంతంగా ఉండాలని అందుకు ధార్మిక, ఆధ్యాత్మిక చింతనకు ప్రోదిచేసే విధంగా తమ వంతు చేయూత అందిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాల్లో తమ పీఠం శాఖలు పని చేస్తున్నాయన్నారు. భవిష్యత్‌లో మరింత విస్తృత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతామన్నారు. కెప్టెన్ దంపతులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ దంపతులకు స్వరూపా నందేంద్ర సరస్వతి ఆశీర్వచనం అందజేశారు. వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్‌రావు సహా పురప్రముఖులు పలువురు స్వామివారి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా బాలస్వామి సన్యాసాశ్రమ స్వీకారోత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.

Related Stories: