దర్యాప్తులో నైపుణ్యత ప్రదర్శించాలి

-వీడియో కాన్ఫరెన్స్‌లో -పోలీస్ అధికారులకు డీజీపీ సూచన వరంగల్ క్రైం, జూన్ 12 : కేసుల పరిష్కారంలో పొలీస్ అధికారులు నైపుణ్యత ప్రదర్శించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి వరంగల్ కమిషనరేట్ పోలీసులకు సూచించారు. బుధవారం డీజీపీ కమిషనరేట్ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో పొలీస్ అధికారులు అవలంభిస్తున్న పద్ధ్దతులపై ఆరా తీశారు. అనంతరం పొలీస్ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జీషీట్ వేసే వరకూ పాటించాల్సిన అంశాలపై సూచనలు చేశారు. ప్రతీ దర్యాప్తులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనుసరించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వీలైనంత వరకు ఫిర్యాదుదారుడి వాడుక భాషలో స్వీయ దస్తూరితో కూడిన దరఖాస్తును స్వీకరించాలని పేర్కొన్నారు. సత్వరమే నేరస్థలాన్ని సందర్శిచడం ద్వారా నేరస్తుడు, బాధితుడికి సంబంధించిన రుజువులను సేకరించడం సులభతరం అవుతుందన్నారు. అన్ని నేరాల్లో ప్రభుత్వ అధికారులను సాక్షులుగా వినియోగించుకోవాలని, ప్రతీ దర్యాపుల్లో సాక్షుల వాంగ్మూల్మాన్ని దర్యాప్తు అధికారులు తప్పనిసరిగా చేతిరాతతో రాయాలన్నారు. సాక్షి వాడుక భాషలోనే నమోదు చేయడం ద్వారా కోర్టు దృష్టి విశ్వసనీయత పెరుగుతుందన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీస్ కస్టడీ, నేరస్తుడి గుర్తింపు, చోరీ కేసుల్లో ఆస్తి గుర్తింపు, సాంకేతిక సాక్ష్యాల సేకరణ, పీటీ వారెంట్, నేరస్తుడికి బెయిల్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు, రిమాండ్ రిపోర్ట్, చార్జిషీట్ మొదలైన అంశాల్లో దర్యాప్తు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపై డీజీపీ సలహాలు అందజేశారు. సమావేశంలో సీపీ రవీందర్, డీసీపీలు కే నాగరాజు, ఆర్ శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్, నర్సంపేట, ఘన్‌పూర్, వర్ధన్నపేట, పరకాల, మామునూర్ ఏసీపీలు నర్సయ్య, సునీతామోహన్, వెంకటేశ్వర్లుబాబు, సుధీంద్రకుమార్, మధుసూదన్, శ్యాంసుందర్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Related Stories: