ఓటర్ లిస్టులో పేరుందా..?

బంజారాహిల్స్: ఓటర్ లిస్ట్‌లో పేరుందా..? సార్ నా పేరులో తప్పులు వచ్చాయి.. చిరునామా మార్చాలి.. అంటూ పలువురు ఓటర్లు పోలింగ్ బూత్‌లలో ఉన్న అధికారుల వద్దకు వచ్చి వాకబు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ జాబితాలను సోమవారం నుంచి నియోజకవర్గంలో 237 పోలింగ్ బూత్‌లలో అందుబాటులో ఉంచడంతో పలువురు ఓటర్లు వచ్చి జాబితాలో పేర్లను సరిచూసుకున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వేంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు అధికారులు అందుబాటులో ఉన్నారు.

సెప్టెంబర్ 25వ తేదీలోగా..!

ఓటర్ జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో చూసుకోవడం, తప్పుల సవరణ, చిరునామా మార్పు తదితర సమస్యలు ఉంటే అక్కడికక్కడే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18 డీఎంసీ గీతా రాధిక పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించి సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఎంసీ గీతా రాధిక మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ప్రకటించిన నూతన గడువులో భాగంగా సెప్టెంబర్ 25వ తేదీలోగా ఓటర్ జాబితాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారని, 18 ఏండ్లు నిండినవారు ఎవరైనా ఉంటే వారిపేర్లను ఓటర్ జాబితాలో చేర్చేందుకు కొత్త దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కొత్త దరఖాస్తులను కూడా పోలింగ్ స్టేషన్లలో స్వీకరించేందుకు బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు.

Related Stories: