ఓడియన్ సాహసగాథ

మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా మలయాళ చిత్రం ఓడియన్. శ్రీ కుమార్‌మీనన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని దగ్గుబాటి క్రియేషన్స్ పతాకంపై దగ్గుబాటి అభిరామ్, సంపత్‌కుమార్ అదే పేరుతో తెలుగులో విడుదలచేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఓ పోరాటయోధుడి స్ఫూర్తిదాయక ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. ఈ సినిమా కోసం యాభై ఐదేళ్ల వయసులో మోహన్‌లాల్ యోగా, వ్యాయామాల ద్వారా శరీరాకృతి మార్చుకొని 35 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నారు. మోహన్‌లాల్ నటన, పీటర్‌హెయిన్స్ పోరాటాలు, గ్రాఫిక్స్ హంగులు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. మలయాళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో డిసెంబర్ 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. భారీ పోటీ నడుమ ఈ చిత్ర తెలుగు హక్కులు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది అని తెలిపారు.