ఒడిదుడుకులతో 5రోజుల నష్టాలకు తెర

రోజంతా ఒడిదుడుకులతో ఇంట్రాడే ట్రేడర్లను ముప్పుతిప్పలు పెట్టి చివరకు లాభంతో ముగిసింది. బ్యాంకింగ్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో వచ్చిన కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 347 పాయింట్లు,నిఫ్టీ 100 పాయింట్ల మేర రికవరీ అయ్యాయి. రెండు సార్లు కనీస స్థాయిలకు పతనం అయిన మార్కెట్ మధ్యలో రికవరీలతో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయింది. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్ 347.94 పాయింట్ల లాభంతో 36,652.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 100.05 పాయింట్ల లాభంతో 11,067.45 వద్ద ముగిసింది. నిఫ్టీలో హెవీ వెయిట్ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎస్ షేర్ల రికవరీతో మార్కెట్ భారీ లాభాలను సాధించగలిగింది. వీటికి తోడు ఫార్మా, ఆటో షేర్ల రికవరీ కూడా మార్కెట్ లాభాలకు దోహదపడింది. క్రూడాయిల్ ధర 81 డాలర్ల ఎగువన ట్రేడ్ అవుతుండడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిసాయి. ఇండెక్స్‌లోని బ్యాంకింగ్ షేర్లు భారీ లాభాల్లోనే ముగియడంతో బ్యాంక్‌నిఫ్టీ కనీస స్థాయిల నుంచి దాదాపు 700 పాయింట్ల మేర లాభపడింది. రూపాయి మారకం విలువ మరింత బలహీన పడినప్పటికీ మార్కెట్ పట్టించుకోలేదు. మరోవైపు హౌజింగ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ షేర్లు భారీ నష్టాలతో ముగిసాయి.స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లలో నష్టాలు కొనసాగాయి. కాగా ఫార్మా ఇండెక్స్ అత్యధికంగా 2.51 శాతం లాభంతో ముగిసింది. ఆర్థిక సేవల రంగం ఇండెక్స్ 1.90 శాతం, బ్యాంక్‌నిఫ్టీ 1.44 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1.26 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, రియాల్టీ ఇండెక్స్ మాత్రం 1.72 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టీలోని కోటక్ బ్యాంక్ 3.26శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 3.18 శాతం, ఎస్‌బీఐ 3.08 శాతం, హిందుస్తాన్‌యూనీలీవర్ 2.99 శాతం, లుపిన్ 2.95 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండియాబుల్స్ హౌజింగ్‌ఫైనాన్స్ 5.60 శాతం నష్టపోగా, భారతీ ఇన్‌ఫ్రాటెల్ 2.83 శాతం, గెయిల్ 2.61 శాతం, యెస్‌బ్యాంక్ 2.61 శాతం చొప్పున నష్టాలతో ముగిసాయి. మార్కెట్ లాభాల్లోనే ముగిసినప్పటికీ ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1182 షేర్లు నష్టాల్లో ముగియగా, కేవలం 659 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసాయి. ఎఫ్‌ఐఐలు మొత్తం రూ. 1234.70 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. మరోవైపు డీఐఐలు రూ. 2284.26 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

లిక్విడిటీ భయాలు వెన్నాడడంతో

డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్లను ఇన్వెస్టర్లు భారీగా అమ్మారు. దీంతో షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో 22.44 శాతం నష్టపోయి రూ. 305.50 వద్ద ముగిసింది. ఒకదశలో రూ. 256.05 కనీస స్థాయికి కూడా నష్టపోయిది. ఎన్‌ఎస్‌ఈ మొత్తం 12.93 కోట్ల షేర్లు చేతులు మారాయి. మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభం అయినషేరు క్రమక్రమంగా భారీ నష్టాల్లోకి జారుకుంది.

ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కంపెనీని ఆదుకుంటామంటూ ఎల్‌ఐసీ ప్రకటించడంతో ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూపు షేర్ల ధరలు12 శాతం మేర లాభపడ్డాయి. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ షేరు 12.02 శాతం లాభపడగా, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టు 5.74 శాతం లాభంతో ముగిసింది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ మాత్రం స్వల్పంగా 0.13 శాతం నష్టపోయింది.