విషపురం రహస్యం

ఆయుష్‌రామ్, శ్రావణి, షఫీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం విషపురం. సందిరి శ్రీనివాస్ దర్శకుడు. పాతూరి బుచ్చిరెడ్డి, పాతూరి మాధవరెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ జాంబీ హారర్ చిత్రమిది. విషపురం అనే ఊరిలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో అక్కడి మనుషులంతా నరరూపరాక్షసులుగా మారిపోతారు. ఆ ఊరికి ఎదురైన సమస్యను తన స్నేహితుల సహకారంతో ఓ యువకుడు ఎలా పరిష్కరించాడన్నది ఆకట్టుకుంటుంది. హారర్ అంశాలతో పాటు అంతర్లీనంగా సినిమాలో చక్కటి ప్రేమకథ ఉంటుంది అని తెలిపారు. కొత్తదనంతో కూడిన సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. గౌటిరాజు, మల్లేష్‌యాదవ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరామెన్: కిషన్ తిప్పరవేని.