ఆండ‌ర్స‌న్‌పై ట్వీట్‌తో ప‌గ తీర్చుకున్న వీరూ

న్యూఢిల్లీ: త‌న‌ను ఐదేళ్ల కింద‌ట డ‌కౌట్ చేసిన బౌల‌ర్‌పై ట్వీట్ ద్వారా ప‌గ తీర్చుకున్నాడు డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్‌. ఇంగ్లండ్ పేస్‌బౌల‌ర్ జేమ్స్ ఆండ‌ర్స‌న్‌.. ఇండియాతో వైజాగ్‌లో జ‌రిగిన రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ తొలి బంతికే డ‌కౌట‌య్యాడు. దీనిని క్రికెట్ ప‌రిభాష‌లో కింగ్స్ పెయిర్ అంటారు. తొలి ఇన్నింగ్స్ అశ్విన్‌, రెండో ఇన్నింగ్స్‌లో జ‌యంత్ యాద‌వ్‌.. ఆండ‌ర్స‌న్‌ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశారు. గ‌త వందేళ్ల‌లో ఇలా కింగ్స్ పెయిర్ సాధించిన ఏకైక ఇంగ్లిష్ క్రికెట‌ర్‌గా అప్ర‌తిష్ట మూట‌గ‌ట్టుకున్నాడు ఆండ‌ర్స‌న్‌. ఈ రికార్డు జేమ్స్‌కి మింగుడుప‌డ‌నిదే అయినా.. మ‌న వీరూ మాత్రం ఖుషీగా ఉన్నాడు. అందుకే ఇలా ట్వీట్ ద్వారా త‌న సంతోషాన్ని పంచుకున్నాడు. ఐదేళ్ల కింద‌ట త‌న‌ను డ‌కౌట్ చేసిన ఆండ‌ర్స‌న్‌.. తాను ఆర్య‌భ‌ట్ట‌కు నివాళి అర్పించేలా చేశాడ‌ని.. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి అత‌నికీ ఎదురైంద‌న్న‌ది వీరూ ట్వీట్ సారాంశం. ఐదేళ్ల కింద‌ట 2011లో ఎడ్‌బాస్ట‌న్‌లో జ‌రిగిన మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో తొలి బంతికే సెహ్వాగ్‌ను డ‌కౌట్ చేశాడు ఆండ‌ర్స‌న్‌. అంత‌కుముందే తొలి ఇన్నింగ్స్‌లో స్టువ‌ర్ట్ బ్రాడ్ వీరూని తొలి బంతికే డ‌కౌట్ చేయ‌డంతో అప్పుడు సెహ్వాగ్ కింగ్స్ పెయిర్ సాధించాడు. ఇప్పుడు ఐదేళ్ల త‌ర్వాత జేమ్స్‌ను ఆట ప‌ట్టించ‌డానికి వ‌చ్చిన అవ‌కాశాన్ని వీరూ ఇలా ట్వీట్ ద్వారా ఉప‌యోగించుకున్నాడు. దీన్ని స్పోర్టింగ్ స్పిరిట్‌తోనే తీసుకున్న ఆండ‌ర్స‌న్ కూడా ఓ క‌న్నీళ్లు పెట్టుకున్న ఓ ఎమోజీతో రీట్వీట్ చేశాడు.

Related Stories: