కోహ్లినే కెప్టెన్.. అతన్ని మార్చే ప్రసక్తే లేదు!

బెంగళూరు: ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ వచ్చే సీజన్‌లో కెప్టెన్‌ను మార్చబోతుందన్న వార్తలను ఆ ఫ్రాంచైజీ ఖండించింది. 2019 సీజన్‌లో కోహ్లి స్థానంలో డివిలియర్స్‌కు కెప్టెన్సీ అప్పగిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ వివరణ ఇచ్చింది. కోహ్లిని మారుస్తున్నామని వచ్చిన వార్తల్లో నిజం లేదు. వచ్చే సీజన్‌లోనూ అతనే కెప్టెన్ అని ఆర్సీబీ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు. రెండు సీజన్లుగా ఆర్సీబీ ప్రదర్శన దారుణంగా ఉంది. 2017లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ఆ టీమ్.. 2018లోనూ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై కాలేదు. దీంతో టీమ్ సపోర్టింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేశారు.

హెడ్ కోచ్‌ను గ్యారీ కిర్‌స్టన్‌ను తప్పించి అతని స్థానంలో డేనియల్ వెటోరీని నియమించింది. ఇక ఫీల్డింగ్ కోచ్ ట్రెంట్ వుడ్‌హిల్, బౌలింగ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌లను కూడా తొలగించింది. గత సీజన్‌లోనే కోచింగ్ స్టాఫ్‌లో చేరిన ఆశిష్ నెహ్రాకు మరిన్ని బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే కోహ్లిని కూడా మారుస్తున్నట్లు వార్తలు వచ్చినా ఫ్రాంచైజీ వాటిని ఖండించింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి కోహ్లి ఆర్సీబీ టీమ్‌తోనే ఉన్నాడు. 4948 పరుగులతో రైనా తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు.

Related Stories: