కోహ్లి మళ్లీ నంబర్ వన్

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో మరోసారి నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లో కోహ్లి రాణించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 97, రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. రెండో టెస్ట్ తర్వాత కోల్పోయిన ర్యాంక్.. ఒక్క టెస్ట్‌తోనే మళ్లీ విరాట్ సొంతమవడం విశేషం. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 937 పాయింట్లు ఉన్నాయి. తన కెరీర్‌లో కోహ్లి ఈ మార్క్‌ను అందుకోవడం ఇదే తొలిసారి.

ట్రెంట్‌బ్రిడ్జ్‌లో చారిత్రక విజయం సాధించిన తర్వాత కోహ్లియే కాదు.. ఇతర టీమిండియా ప్లేయర్స్ ర్యాంకులు కూడా మెరుగయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలర్ల జాబితాలో ఏకంగా 23 స్థానాలు మెరుగుపరచుకొని 51వ ర్యాంకులో నిలిచాడు. ఇక తొలి రెండు టెస్టులకు దూరమైనా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి రాణించిన జస్‌ప్రీత్ బుమ్రా కూడా 37వ ర్యాంక్‌కు ఎగబాకాడు. కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన బుమ్రా.. 37వ ర్యాంక్‌కు దూసుకురావడం విశేషమే.

Related Stories: