గంగూలీని మించిపోయిన కోహ్లి

నాటింగ్‌హామ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ కెప్టెన్‌గా అజారుద్దీన్ రికార్డును తిరగరాసిన కోహ్లి.. తాజాగా మరో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ సౌరవ్ గంగూలీని మించిపోయాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో టీమిండియా 22 మ్యాచుల్లో విజయం సాధించింది. 21 విజయాలతో ఇన్నాళ్లూ రెండోస్థానంలో ఉన్న గంగూలీని వెనక్కినెట్టాడు కోహ్లి. 27 విజయాలతో ధోనీ తొలి స్థానంలో ఉన్నాడు. ధోనీ కెప్టెన్సీలో 60 టెస్టుల్లో 27 మ్యాచుల్లో ఇండియా గెలిచింది. సమీప భవిష్యత్తులోనే ధోనీని కూడా కోహ్లి మించిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

2014లో ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా ధోనీ నుంచి కెప్టెన్సీ అందుకున్న కోహ్లి.. తర్వాత శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లపై సిరీస్‌లు గెలిచాడు. అయితే శ్రీలంక, వెస్టిండీస్ తప్ప మిగతా అన్ని సిరీస్ విజయాలు సొంతగడ్డపై వచ్చినవే. కోహ్లి కెప్టెన్సీలో పది విజయాలు విదేశాల్లో వచ్చాయి. అదే గంగూలీ సాధించిన 21 విజయాల్లో 11 విదేశీ గడ్డపై వచ్చినవి కావడం విశేషం. గతంలో ఇంగ్లండ్ గడ్డపై బ్యాటింగ్‌లో పెద్దగా రాణించని విరాట్ కోహ్లి.. ఈసారి మాత్రం టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే మూడు టెస్టుల్లో రెండు సెంచరీలు చేశాడు. మూడో టెస్ట్ రెండు ఇన్నింగ్స్ కలిపి 200 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

× RELATED బంధువుల ఇంట్లో బస.. పోలింగ్ సిబ్బంది తొలగింపు