కోహ్లి ఈ రికార్డు సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్!

లండన్: ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా.. కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఒక్క రెండో టెస్ట్‌లో తప్ప మిగతా అన్ని మ్యాచుల్లో కనీసం హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో అతను మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా 4 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా నిలిచాడు. ఇంతకుముందే ఇదే మ్యాచ్‌లో టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేశాడు. 119 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ మార్క్ అందుకున్నాడు. గవాస్కర్ (117 ఇన్నింగ్స్) తర్వాత అత్యంత వేగంగా 6 వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో భారతీయ క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.

టెస్టుల్లో నంబర్ వన్‌గానే విరాట్

ఇంగ్లండ్ సిరీస్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి టెస్టుల్లో తన నంబర్ వన్ ర్యాంకును నిలుపుకున్నాడు. సోమవారం ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. నాలుగో టెస్టులో టీమ్ ఓడినా.. కోహ్లి 46, 58 పరుగులు చేశాడు. దీంతో 937 పాయింట్లతో తన నంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ 8 ఇన్నింగ్స్‌లో కలిపి కోహ్లి 544 పరుగులు చేయడం విశేషం. మరోవైపు నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పుజారా ఆరోస్థానంలో కొనసాగుతున్నా.. ఈ ఇన్నింగ్స్ ద్వారా అతని ఖాతాలో మరో 32 పాయింట్లు చేరాయి.

Related Stories: