కింగ్ కోహ్లి.. ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో వరల్డ్ నంబర్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ఆదివారం ప్రకటించిన తాజా ర్యాంకుల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెనక్కి నెట్టి కోహ్లి ఈ ఘనత సాధించాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత టెస్టుల్లో నంబర్ వన్ అయిన తొలి టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లినే కావడం విశేషం. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 149, 51 పరుగులు చేసిన విరాట్.. 31 పాయింట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో 32 నెలలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్‌ను మించిపోయాడు. ఇప్పటివరకు 67 టెస్టులాడిన విరాట్.. తొలిసారి నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు.

ప్రస్తుతం స్మిత్ కంటే ఐదు పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. తన ర్యాంకును నిలుపుకోవాలంటే సిరీస్ మొత్తం తన ఫామ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. తొలి టెస్ట్‌కు ముందు కోహ్లి ఖాతాలో 903 పాయింట్లు ఉన్నాయి. టీమిండియా ఆల్‌టైమ్ హైయెస్ట్ సునీల్ గవాస్కర్ కంటే 13 పాయింట్లు వెనుకబడి ఉండగా.. ఇప్పుడతని కంటే 18 పాయింట్లు ఎక్కువగా సాధించాడు. కోహ్లి కాకుండా టెస్టుల్లో సచిన్, ద్రవిడ్, గంభీర్, గవాస్కర్, సెహ్వాగ్, వెంగ్‌సర్కార్ నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నవాళ్లలో ఉన్నారు. కోహ్లి వన్డేల్లోనూ నంబర్ వన్ కావడం విశేషం.

Related Stories: