ఏది ఏమైనా కోహ్లి ఆడి తీరాల్సిందే!

లండన్: ఇంగ్లండ్‌లో టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. టీమ్ పర్ఫార్మెన్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతోపాటు మూడో టెస్ట్‌కు ముందు కొన్ని కీలక సూచనలు చేశాడు. గాయంతో బాధపడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లి మూడో టెస్ట్‌కు అనుమానంగా మారడంపై స్పందిస్తూ.. ఏది ఏమైనా అతడు ఆడాల్సిందేనని స్పష్టంచేశాడు. తన గాయం తీవ్రతను కోహ్లియే అంచనా వేసుకోవాలి. ఒకవేళ నేనే కెప్టెన్ అయి ఉంటే కోహ్లి 50 శాతం ఫిట్‌గా ఉన్నా ఆడిస్తాను. టీమ్‌లో అతడు అంతటి కీలక ప్లేయర్. నడవలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప కోహ్లి కచ్చితంగా ఆడాలి. అయితే తాను ఎంత బాధ భరించగలడో కోహ్లియే నిర్ణయించుకోవాలి అని గవాస్కర్ అన్నాడు. ఇక బ్యాటింగ్ ఘోరంగా విఫలమవుతున్న నేపథ్యంలో కరుణ్ నాయర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఇక నుంచి ఇద్దరు స్పిన్నర్ల అవసరం లేదని, ఓ స్పిన్నర్ స్థానంలో అదనపు బ్యాట్స్‌మన్ అయిన కరుణ్ నాయర్‌ను తీసుకోవాలని సన్నీ చెప్పాడు. ఇక దినేష్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలని కూడా స్పష్టంచేశాడు.

అటు లార్డ్స్ టెస్ట్ నాలుగు రోజుల్లోనే ముగియడంతో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఒక రోజు అదనంగా ప్రాక్టీస్ చేసే అవకాశం వచ్చింది. అయినా టీమ్ మాత్రం మ్యాచ్ జరగబోయే నాటింగ్‌హామ్‌కు వెళ్లకుండా లండన్‌లోనే గడపడంపై గవాస్కర్ మండిపడ్డాడు. వాళ్లు ఎందుకు ఒక రోజు రెస్ట్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. లండన్ అంటే మనోళ్లకు చాలా ఇష్టం. అయితే నాటింగ్‌హామ్‌లో దొరికినంత ఈజీగా లండన్‌లో ప్రాక్టీస్ వసతులు దొరకవు. ఇక నుంచి ఆప్షనల్ ప్రాక్టీస్ అంటూ ఉండకూడదు. ఇప్పటికే రెండు టెస్టులు ఓడిన తర్వాత ఇంకా ఆప్షనల్ ప్రాక్టీస్ ఎందుకు అని గవాస్కర్ అన్నాడు. ప్రాక్టీస్ కాదు.. అసలు ప్రాక్టీస్ మ్యాచ్‌లే ఉండాలని కూడా అభిప్రాయపడ్డాడు. మూడు, నాలుగు టెస్ట్‌ల మధ్య చాలా సమయం ఉన్నదని, అప్పుడు కనీసం ఒక్క ప్రాక్టీస్ మ్యాచయినా ఆడాలని సన్నీ సూచించాడు.

Related Stories: