మరో షాక్.. కోహ్లికి గాయం!

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్. కెప్టెన్ విరాట్ కోహ్లి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. మూడో రోజు టీ తర్వాత ఫీల్డ్ వదిలి వెళ్లిన కోహ్లి.. నాలుగో రోజు అసలు ఫీల్డ్‌లో అడుగుపెట్టలేదు. అతని స్థానంలో జడేజా ఫీల్డింగ్ చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండో వికెట్ పడిన తర్వాత కోహ్లి బ్యాటింగ్‌కు రాలేదు. అతని స్థానంలో రహానే వచ్చాడు. కోహ్లి లేకపోవడంతో కెప్టెన్సీని కూడా రహానేనే చేపట్టాడు. వెన్నునొప్పి వల్లే అతడు ఫీల్డింగ్‌కు రాలేదని టీమ్ అధికారి ఒకరు వెల్లడించారు.

నిజానికి కోహ్లి మాత్రమే కాస్తోకూస్తో ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటున్నాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అతనికి ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో తొలి టెస్ట్‌లో ఓటమి తప్పలేదు. ఇక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ టీమ్ 107 పరుగులకే కుప్పకూలినా.. కోహ్లి 23 పరుగులు చేశాడు. ఇప్పుడతను వెన్నుగాయంతో బాధపడుతుండటం టీమ్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.

Related Stories: