ర‌జ‌నీకాంత్ సినిమాలో చేయ‌డానికి కార‌ణం చెప్పిన స్టార్ హీరో

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ 168వ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్ళ‌నుండ‌గా, మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొంద‌నుంది. జిగ‌ర్తాండ ఫేం కార్తీక్ సుబ్బ‌రాజు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించనున్నారు. ఈ మూవీలో ర‌జ‌నీకాంత్‌తో పాటు సిమ్రాన్, బాబీ సింహా, స‌న‌త్ రెడ్డి, క‌రుణాక‌న్‌, యోగి బాబు ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు . భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌జ‌నీకాంత్ 45 రోజులు డేట్స్ కేటాయించాడ‌ట‌. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని రూపొందించ‌నుంది.

చిక్కడు దొరకడు, పిజ్జా తోపాటు పలు హిట్ చిత్రాలను తెర‌కెక్కించిన‌ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించాలని భావిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్ర‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. అయితే త‌మిళ ప‌రిశ్ర‌మలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న విజ‌య్ సేతుప‌తి ఈ మూవీలో ప్రతినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మ‌ధ్య విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తున్నాడు విజ‌య్ సేతుప‌తి. విక్ర‌మ్ వేద‌లో మాధ‌వ‌న్‌తో క‌లిసి న‌టించిన ‘మక్కల్‌ సెల్వన్‌’ విజ‌య్ సేతుప‌తి.. చిరంజీవి 151వ చిత్రం సైరాలోను ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

విజ‌య్ సేతుపతి, కార్తిక్ సుబ్బరాజ్ ఇద్దరూ మంచి స్నేహితులు కాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘పిజ్జా, ఇరైవి, బెంచ్ టాకీస్’ వంటి హిట్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో తాను సినిమా స్క్రిప్ట్ కూడా విన‌కుండా ఓకే అనేశాడ‌ట‌. అంతేకాదు ఎప్ప‌టి నుండో ర‌జ‌నీకాంత్‌తో న‌టించాల‌నే కోరిక ఈ మూవీతో తీర‌బోతుంద‌ని విజ‌య్ సేతుప‌తి మీడియాతో చెప్పాడు.

× RELATED డీకే అరుణ వర్సెస్ జైపాల్ రెడ్డి