పాతబస్తీకి మెట్రో కళ

-అ-సెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనతో తొలిగిన సందిగ్ధత -పాత అలైన్‌మెంట్ ప్రకారమే ఆస్తుల సేకరణ -15 కి.మీల మార్గంలో 9.6 కి.మీల మేర కొనసాగుతున్న పనులు -మిగతా పెండింగ్ పనులకు మార్గం సుగమం హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని పాతబస్తీలో మెట్రో పరుగులు ఎప్పుడా అన్న సందిగ్ధతకు తెరపడింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వడంతో ఓల్డ్‌సిటీకీ మెట్రోరైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానున్నది. పాత అలైన్‌మెంట్ ప్రకారమే భూసేకరణ తదితర పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో కారిడార్-2 పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టును మూడు కారిడార్లుగా విభజించి పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. కారిడార్-2 కింద జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 15 కిలోమీటర్ల పొడవుతో మెట్రో మార్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అలైన్‌మెంట్ సిద్ధం చేశారు. అయితే పాతబస్తీ మీదుగా అలైన్‌మెంట్ విషయంలో అభ్యంతరాలు తలెత్తాయి. దీంతో 15 కి.మీల మార్గంలో వివాదాలు లేని 9.66 కి.మీల మార్గం పనులు చేపట్టి, దాదాపు 5.5 కిలోమీటర్ల పనులు పెండింగ్‌లో ఉంచారు. మిగతా మార్గంలోనూ పాత అలైన్‌మెంట్ ప్రకారమే పనులు చేపట్టాలని తాజాగా సీఎం స్పష్టం చేశారు. వేగంగా పనులు కారిడార్-2లో భాగంగా చేపట్టిన 9.66 కి.మీల మార్గం పనులు కొనసాగుతున్నాయి. 6.5 కి.మీల మేర వేగవంతంగా జరుగుతుండగా, మిగతా 3.15 కి.మీల పనులు పిల్లర్ల స్థాయిలో ఉన్నాయి. పది స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఫౌండేషన్లు 92.2 శాతం పూర్తయ్యాయి. 373 ఫౌండేషన్స్‌కుగానూ 344 పూర్తి చేశారు. 260 స్పాన్‌లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే 178 పూర్తయ్యాయి. ఎంజీబీఎస్‌లో నిర్మిస్తున్న ఇంటర్‌చేంజ్ స్టేషన్ దాదాపు పూర్తయింది. సీఎం ప్రకటన నేపథ్యంలో పెండింగ్ పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. కారిడార్-2 స్టేషన్లు ఇవే 15 కిలోమీటర్ల రెండో కారిడార్‌లో 16 స్టేషన్లు నిర్మించనున్నారు. ఇందులో పది స్టేషన్ల పనులు పురోగతిలో ఉన్నాయి. మిగతా ఐదు స్టేషన్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పరేడ్‌గ్రౌండ్స్, సికింద్రాబాద్, గాంధీ దవాఖాన, ముషీరాబాద్, ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సల్తాన్‌బజార్, ఎంజీబీఎస్ స్టేషన్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎంజీబీఎస్ ఇంటర్‌చేంజ్ స్టేషన్‌లో కారిడార్-1 కలుస్తుండటంతో ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నా యి. అలైన్‌మెంట్ అభ్యంతరాలతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఐదున్నర కిలోమీటర్ల మార్గంలో సాలర్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషేర్‌గంజ్, జంగమ్మేట్, ఫలక్‌నుమా స్టేషన్లను నిర్మించాల్సి ఉన్నది. స్టేషన్లతోపాటు మెట్రో మార్గం నిర్మించేందుకు ఆస్తుల సేకరణ చేపట్టాల్సి ఉన్నది.

Related Stories: