మోదీ హత్యకు కుట్ర.. వరవరరావు అరెస్ట్

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారన్న కేసులో పుణె పోలీసులు మంగళవారం హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావును అరెస్ట్ చేశారు. సుమారు 8 గంటల పాటు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. తర్వాత వరవరరావును అరెస్ట్ చేశారు. ముందు ఆయనను ఆరోగ్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచి వరవరరావును పుణెకు తరలించనున్నట్లు తెలుస్తున్నది. ఆయనతోపాటు మరో ఇద్దరు సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. మోదీ హత్యకు సంబంధించిన కేసులో మావోయిస్టుల లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు పుణె పోలీసులు గుర్తించారు.

అయితే కేవలం ఆ లేఖలో పేరు ఉన్నందుకే పోలీసులు వరవరరావును అరెస్ట్ చేశారని ఆయన భార్య ఆరోపించారు. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో ఢిల్లీలోని మావోయిస్టు సానుభూతిపరుడు రోనా జాకబ్ విల్సన్ ఇంట్లో పుణె పోలీసులు ఓ లేఖను గుర్తించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో అరెస్టయిన ఐదుగురిలో జాకబ్ విల్సన్ కూడా ఒకరు. ఇందులో ఎం-4 రైఫిల్‌తోపాటు, నాలుగు లక్షల రౌండ్ల బుల్లెట్ల కొనుగోలు కోసం 8 కోట్లు అవసరమని, అది వరవరరావు సమకూరుస్తారని లేఖలో రాసి ఉంది.

× RELATED సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి