అద్దె కార్లను విక్రయిస్తూ జల్సాలు

హైదరాబాద్ : అద్దెకు తీసుకున్న కార్లకు తప్పుడు పత్రాలను సృష్టించి ఓఎల్‌ఎక్స్‌లో అమ్ముతున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ కేఎస్ రావు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లా విజయవాడలోని పోరంకి ప్రాంతానికి చెందిన బాలవంశీ కృష్ణ(31) బీటెక్ చదివి బెంగళూరులో ఉద్యోగం చేశాడు. అక్కడ ఉద్యోగం నుంచి తొలగించడంతో నగరానికి వచ్చాడు. అప్పటికే గుర్రపు పందాలు, క్రికెట్ బెట్టింగ్, తదితర వ్యసనాలకు అలవాటు పడ్డ వంశీకృష్ణ డబ్బుల కోసం సరికొత్త మోసానికి తెరతీశాడు. కార్లను అద్దెకు తీసుకొని, వాటిని ఓఎల్‌ఎక్స్‌లో విక్రయించడం ప్రారంభించారు. ఈ కార్లకు బోగస్ బ్యాంకు లోన్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లను తయారు చేసి పలువురికి కార్లను విక్రయించాడు. ఇదే క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నం.12కు చెందిన శ్రీలతకు హ్యుందాయ్ ఐ-20ను అమ్మాడు. కారు సురేశ్ జాదవ్ అనే వ్యక్తి పేరుతో ఉండడంతో.. అతడి పేరుతో డెత్ సర్టిఫికెట్ తయారు చేసి శ్రీలతను మోసం చేసి కారును విక్రయించాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా బ్యాంకులో రుణం పెండింగ్‌లో ఉందంటూ తేలింది. అక్కడ వాకబుచేయగా మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఈ నెల 6న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితుడు వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మొత్తం 8 కేసు ల్లో నిందితుడని తేలింది. ఆ కార్లను విక్రయించగా వచ్చిన రూ.30లక్షలతో జల్సాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి మూడు కార్లు, రూ.29.8లక్షల నగదుతో పాటు ఫోర్జరీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
× RELATED వేర్వేరు ప్రాంతాల్లో న‌లుగురు అదృశ్యం