అమెరికాలో భారత విద్యార్థులకు తోడ్పాటు

యూనివర్సిటీ ఫెయిర్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా భరోసా హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలను మెరుగుపరచడంలో విద్యారంగం కీలకపాత్ర పోషిస్తున్న దని యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా అభిప్రాయపడ్డారు. విద్య కోసం అమెరికాకు వచ్చే భారత విద్యార్థులకు తమవంతు తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు. తాజ్‌డెక్కన్ హోటల్‌లో ఆదివారం యూఎస్ యూనివర్సిటీ ఫెయిర్‌ను క్యాథరిన్ హడ్డా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయస్థాయి కోర్సులను అభ్యసించాలనుకొనే హైదరాబాద్ విద్యార్థులకు అమెరికాలోని విద్యాసంస్థలు, కళాశాలల సమాచారాన్ని అందించేందుకే ఈ ఫెయిర్‌ను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఈ ఫెయిర్‌కు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరుకావడం పట్ల సంతోషాన్ని వ్యక్తంచేశారు. అమెరికాకు చెందిన 43 విద్యాసంస్థలు, కళాశాలలు ఫెయిర్‌లో పాల్గొన్నాయని, భారత విద్యార్థులను చేర్చుకునేందుకు ఈ విద్యాసంస్థలు ఆసక్తితో ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం అమెరికాలో 1.86 లక్షల మంది భారత విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో 17 శాతం మంది భారతీయులే ఉన్నారని క్యాథరిన్ వెల్లడించారు. ఈ ఫెయిర్‌లో న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ సహా మొత్తం 43 అమెరికా విద్యాసంస్థల ప్రతినిధులు తమ స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. ముందస్తుగా దరఖాస్తుచేసుకున్న దాదాపు 1200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ఫెయిర్‌కు హాజరై అమెరికాలోని అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సుల గురించి ఆరాతీశారు. అమెరికాలోని ఏ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఏ కాలేజీలో ఏ కోర్సుకు డిమాండ్ ఉన్నదన్న అంశాలను తెలుసుకునేందుకు వారు ఆసక్తి చూపారు.